పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీ లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు తొలి జాబితాలో టికెట్ కూడా చంద్రబాబు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్థసారథి టీడీపీలో చేరారు. పార్థసారథికి పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా లోకేష్ ఆహ్వానించారు. విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ కూడా పార్థ సారధితోపాటు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్థసారథి వెంట టీడీపీ నేతలు కేశినేని చిన్ని, కొల్లు రవీంద్ర, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, బోడె ప్రసాద్ ఉన్నారు.
మరోవైపు తాను టీడీపీలో చేరబోతున్నానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. కొద్దిరోజులుగా ఆయన టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారానికి తెరదించుతూ ఆ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో మరో రెండు రోజుల్లో సైకిల్ ఎక్కబోతున్నానని ఆయన చెప్పారు. మైలవరం కార్యకర్తలతో కలిసి చంద్రబాబు దగ్గరికి వెళ్తానని అన్నారు. ఇక, మైలవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు.
టీడీపీ హైకమాండ్ సమక్షంలో ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని ముందుకు పోతామని అన్నారు. చంద్రబాబు, లోకేష్ లను వ్యక్తిగతంగా దూషించాలని జగన్ తనను ఆదేశించారని విమర్శలు గుప్పించారు. మైలవరం టికెట్ ఇస్తానని చెబుతూనే వారిని తిట్టాలని తనకు సూచించారని అన్నారు. అటువంటి వైసీపీలో ఉండలేక టిడిపిలో చేరుతున్నానని, విపక్ష నేతలను తిట్టే వారికే వైసీపీలో టికెట్లు దొరుకుతాయని ఆరోపించారు.
కాగా, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా టిడిపిలో చేరుతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ప్రచారానికి తెరదించుతూ తాను టిడిపిలో చేరబోతున్నానని లావు స్వయంగా ప్రజలకు లేఖ రాశారు. చంద్రబాబు సమక్షంలోనే టిడిపిలో చేరుతున్నానని ఆయన ప్రకటించడంతో టీడీపీలో చేరికలు పెరిగినట్లయింది.