అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏమి చేసినా అడిగేదెవడురా నా ఇష్టం…మీ ఇళ్లలో గబ్బిళాలనే పెంచండి అంటా నా ఇష్టం…ఓ తెలుగు సినీకవి…ఓ మూర్ఘుడి పాత్రనుద్దేశించి రాసిన ఈ పాట టాలీవుడ్ లో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ పాలన, వైసీపీ నేతల ప్రవర్తనకు…ఈ పాట అతికినట్టు సరిపోతుందని విమర్శలు వస్తున్నాయి. ఏపీలో జగన్ పాలన అస్తవ్యస్థంగా మారడం ఒక ఎత్తయితే…యథారాజ తథా ప్రజల అన్న చందంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా జగన్ బాటలోనే పయనించడం శోచనీయం.
తాజాగా ఓ కాంట్రాక్టర్ ను రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు, అధికార పార్టీ నేత జయరామరెడ్డి బెదిరించిన వైనం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గంలో తమ నాయకుడు చెప్పిందే వేదమని, లేకుంటే లెక్కలు తేల్చేస్తామంటూ కాంట్రాక్టర్ కు జయరామరెడ్డి వార్నింగ్ ఇచ్చిన వైనం అనంతపురం జిల్లాలో పెను దుమారం రేపుతోంది. ఇలా బహిరంగంగా కాంట్రాక్టర్ ను ఓ ఎమ్మెల్యే అనుచరుడు బెదిరించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాయదుర్గం కనేకల్ రహదారి పనులు నిలిపివేయాలంటూ ఆ కాంట్రాక్టర్ ను జయరామ రెడ్డి హెచ్చరించిన ఘటన వైరల్ అయింది. ఎమ్మెల్యేను కలవకుండా పనులు ఎలా మొదలుబెడతారంటూ జయరామరెడ్డి దూషణలకు దిగారు. వెంటనే రహదారి పనులు ఆపాలని..లేకుంటే భౌతిక దాడులకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, రాయదుర్గంలో వైసీపీ నేత జయరామరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజెరపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో టెంకాయ కొట్టి రోడ్డు నిర్మాణ పనులు మొదలెడతారని, కానీ, జగన్ పాలనలో మాత్రం జేఎంఎం ట్యాక్స్ కడితేనే పనులు ప్రారంభించాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర స్థాయిలో జే ట్యాక్స్..జిల్లా స్థాయిలో మినిస్టర్ ట్యాక్స్…నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ట్యాక్స్ చెల్లించకుంటే బెదిరింపులకు దిగుతున్నారని దుయ్యబట్టారు. జగన్, వైసీపీ నేతల తీరు మారకపోతే ఆ రహదారుల గోతుల్లో వైసీపీని ప్రజలు తొక్కేస్తారని వార్నింగ్ ఇచ్చారు.