ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, ఎలాగైనా ఎన్నికల్లో నెగ్గేందుకు వైసీపీ నేతలు కుదిరితే బుజ్జగింపు…లేకుంటే బెదిరింపు అన్న రీతిలో అభ్యర్థులను, ఓటర్లను భయపెడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి రెబల్ గా నామినేషన్ వేయడంపై యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
నామినేషన్ వెనక్కు తీసుకోవాలని ఆ అభ్యర్థి అల్లుడిని కన్నబాబు రాజు బెదిరించడంతో అతడు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దీంతో, కన్నబాబు రాజును నిన్న అరెస్టు చేసిన పోలీసులు…స్టేషన్ బెయిలుపై విడుదల చేశారు. అయినప్పటికీ కన్నబాబు రాజు తీరు మారలేదు. ఈ సారి బహిరంగంగానే ప్రజలను కన్నబాబు రాజు భయభ్రాంతులకు గురి చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. గెలిచినా….ఓడినా…వైసీపీ అభ్యర్థే సర్పంచ్ అంటూ కన్నబాబు రాజు హుకుం జారీ చేశారన్న ఆరోపణలు ఇపుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
తమ అభ్యర్థి గెలవకుంటే ఊరికి రోడ్లు, కొళాయిలు, పైప్లైన్లు ఏమీ రావని, నిర్మాణంలో ఉన్న సచివాలయం పనులు నిలిచిపోతాయని కన్నబాబు రాజు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తాను ఎంత మంచివాడ్నో, అంత మూర్ఖుడ్ని అంటూ, తన నియోజకవర్గంలో సీఎం తర్వాత పనులు, పథకాల కోసం తన దగ్గరకు రావాల్సిందేనని చెప్పినట్టు తెలుస్తోంది. గెలిచినా, ఓడినా ఐదేళ్లు సర్పంచ్ తమ వాడేనని, పొరపాటున వేరే వ్యక్తి గెలిస్తే కూర్చోవడానికి కుర్చీ కూడా ఉండదని, నేలపైనే కూర్చోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి.
తాను దేవుడు చెప్పినా విననని, టీడీపీ నేతలు ఆంజనేయరెడ్డి, శంకరరావులకు నరకం చూపిస్తానని బాహాటంగా చెప్పినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇళ్ల పట్టాలు వచ్చాయని సంబరపడొద్దని. తేడా వస్తే తర్వాత రావాల్సినవేవీ అందవని హెచ్చరించినట్టు తెలుస్తోంది. తన బంధువు అయిన అభ్యర్థితో మాట్లాడిన అచ్చెన్నను అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్ కు తరలించిన పోలీసులు … కన్నబాబు రాజును వెంటనే బెయిల్ పై విడుదల చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
బెయిల్ పై విడుదలైన కన్నబాబు రాజు..మరోసారి బెదిరింపులకు దిగారని, ఈసారి ఆయనను మళ్లీ అరెస్టు చేసి విడుదల చేస్తారని అంటున్నారు. ఇలా వదిలేస్తే…ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఫలితాలను తారుమారు చేస్తారని, ఇటువంటివారిపై పోలీసులు చర్యలు తీసుకునేలా ఎస్ఈసీ ఆదేశాలివ్వాలని కోరుతున్నారు.