జనసేన అధినేత పవన్ కల్యాణ్ , జనసేన కార్యకర్తలపై భీమవరం ఎమ్మెల్యే, వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పెనుదుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. మత్స్యపురిలో దళితులపై జనసేన కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించిన గ్రంథి శ్రీనివాస్….జనసేన కార్యకర్తలను సంఘ విద్రోహ శక్తులంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. బాధ్యతగల పదవిలో ఉన్న గ్రంథి శ్రీనివాస్… పవన్ మెడ మీద తలకాయలు ఉండదంటూ వ్యాఖ్యలు చేయడంపై పలువురు మండిపడ్డారు.
అయినప్పటికీ గ్రంథి శ్రీనివాస్ తీరు మారలేదు. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ లెక్క చేయని గ్రంథి శ్రీనివాస్….తాజాగా మరోసారి అదే తీరున పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. పవన్ ను స్టేట్ రౌడీ అంటూ విమర్శించిన గ్రంధి శ్రీనివాస్ జనసైనికులను ఆకు రౌడీలంటూ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గౌరవప్రదమైన శాసనసభ్యుడిగా ఉన్న గ్రంథి శ్రీనివాస్….పవన్ ను మానసిక రోగి అని, గత ఎన్నికల్లో రెండు చోట్ల పిచ్చికుక్కల వ్యాన్లో పవన్ ను ప్రజలు వేసి పంపించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీంతో, గ్రంథి శ్రీనివాస్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. వైసీపీ నేతలకు అహంభావం ఎక్కువైందని, అధికారం ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు…ఇలా గెలిచిన వారిపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారని దుయ్యబడుతున్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీ నేతలకు బుద్ధి చెబుతారని అంటున్నారు. పవన్ పై గ్రంథి శ్రీనివాస్ గందీ బాత్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.