ఏపీలో కొద్ది నెలల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లు ప్రజలను బెదిరించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొందరు వైసీపీ నేతలు కూడా పరోక్షంగా తమకు ఓటు వేయని వారిని టార్గెట్ చేస్తామని హెచ్చరించారని ఆరోపణలు కూడా వచ్చాయి.
ఇక, అప్పట్లో వైసీపీకి ఓటు వేయలేదు అన్న కక్షతో కొన్ని ప్రాంతాల్లో టిడిపి నేతల ఇళ్లపై వైసీపీ నేతలు అధికారులను అడ్డుపెట్టుకొని కక్ష కూడా సాధించారని ఆరోపణలు వచ్చాయి. నరసరావుపేటలో టీడీపీ నేతల ఇళ్ల ప్రహరీ గోడలను నిబంధనల పేరుతో కూల్చివేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అంతేకాదు, ఆ టీడీపీ నేతలకు మద్దతుగా ఉన్న ప్రజలను వైసిపి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి.
ఇలా, ఎన్ని విమర్శలు వస్తున్నా సరే వైసిపి నేతల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకుంటే పెన్షన్లు ఆపేస్తామని కాకినాడ వైసిపి ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకుంటే పథకాలు ఆగిపోతాయని ప్రజలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. అన్నవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న చంద్రప్రసాద్ చేసిన ఈ విమర్శలు వైరల్ గా మారాయి.
ప్రజలకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు వంటి ఎన్నో జగన్ ఇచ్చారని, మహిళల కోసం ఎన్నో పథకాలు తెచ్చారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి నుంచే ఇలా ఓటర్లను బెదిరించడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. సంక్షేమంతో, అభివృద్ధితో ప్రజల మనసు గెలుచుకోవాలని, అప్పుడు ఇలా బెదిరించాల్సిన అవసరం లేకుండానే వారు ఓట్లు వేస్తారని కామెంట్లు చేస్తున్నారు.