విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తమ్ముడు బొత్స అప్పల నర్సయ్య ఓ వివాదంలో ఇరుక్కున్నారు. దాంతో ఇక్కడి విజయనగరంలో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఓ టీడీపీ మహిళా సర్పంచ్ పై ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలే విజయనగరంలో చోటు చేసుకున్నాయి. మంత్రి బొత్స అనుచిత ప్రవర్తనకు సంబంధించి, వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పలు వార్తలు, వివరాలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా జరిగిన ఘటనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్న తీరే అత్యంత అభ్యంతరకర రీతిలో ఉందని ఆధారాలు చెబుతున్నాయి. ఇంతకూ ఏమయిందంటే..
ఆమె పేరు రుంకాన అరుణ. రామన్న పేట సర్పంచ్. గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో ఏకైక టీడీపీ సర్పంచ్ ఈమెనే కావడం గమనార్హం. మంత్రి తమ్ముడు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఈ నియోజకవర్గానికే! అయితే రామన్నపేటలో మంజూరురైన పాల కేంద్రం భవన నిర్మాణానికి సంబంధించిన బిల్లును వేరే సర్పంచ్ పేరిట చెల్లింపులు చేసేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఆమె నిలదీశారు నిన్నటి మండల సర్వసభ్య సమావేశంలో.. ! తన గ్రామంలో చేపట్టిన భవన నిర్మాణపు పనలకు జిన్నాం సర్పంచ్ పేరిట బిల్లులు ఎలా చెల్లిస్తారని నిలదీశారు. దాంతో మంత్రి తమ్ముడు, ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఆగ్రహంతో ఊగిపోయారు. నాకు నచ్చిన విధంగా పనులు చేస్తాను అడగడానికి నువ్వెవ్వరు అన్న ధోరణిలో మాట్లాడారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.