గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీకి భారీ మెజారిటీతో అఖండ విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఖడ్గం సినిమాలో అప్ కమింగ్ హీరో రవితేజ లాగా ఒక్క చాన్స్… ఒకే ఒక్క చాన్స్ అంటూ సీఎం జగన్ పాదయాత్రలో కనిపించిన ప్రతివారిని అడగడంతో మెజారిటీ జనాలు ఓటు వేసి జగన్ ను సీఎం చేశారు. ఇక, జగన్ ఫ్యాన్ హవాలో చాలామంది కొత్త మొహాలు వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
151 మంది ఎమ్మెల్యేలున్నారన్న బలంతో ఏపీలో వైసీపీ నేతలు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా పరిస్థితి తయారు కావడంతో ప్రజల కళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల గుంటూరు జిల్లాలోని క్రోసూరు మార్కెట్ యార్డులో ఓ వైసీపీ నేత పుట్టిన రోజు వేడుకులు జరుపుకోవడం వివాదాస్పదమైంది. వైసీపీ చేపట్టిన రైతు దినోత్సవం నాడే…మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సదరు నేత రికార్డింగ్ డాన్సు ప్రోగ్రామ్ పెట్టి చిందులేయడం వైరల్ అయింది.
ఇక, తాజాగా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తెనాలిలో చేస్తున్న రచ్చపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేకు బర్త్ డే విషెస్ చెబుతూ వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ లు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు. తెనాలిలో మూడు వంతెనలపై భారీ హోర్డింగులు ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు…రైల్వే స్టేషన్ రోడ్ వంతెన సెంటర్ లోనూ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.
అయితే, ఆ భారీ హోర్డింగ్ ల కారణంగా ట్రాఫిక్ బ్లాక్ అయింది. కానీ, ఆ వ్యవహారాన్ని ఏమాత్రం పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు….వాహనాలను చెక్ చేస్తూ చలానాలపై ఫోకస్ పెట్టడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులకు డ్యూటీపై చాలా నిబద్ధత ఉందని, అందుకే హోర్డింగ్ ఏర్పాటు చేసే క్రమంలో ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాల్సింది పోయి…చలానాలపై శ్రద్ధ పెట్టారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.