సీఎం జగన్ పాలనలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా గౌరవం లేదని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లకు ఉన్నంత గౌరవం కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు లేదని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు గతంలో వాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమని, నాలుగేళ్లలో ఎమ్మెల్యేలతో జగన్ కలిసి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ అని విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వారిలో కొందరు బయటపడగా మరికొందరు తమ అసంతృప్తిని అధినేత ముందు వెళ్లగక్కారని తెలుస్తోంది. ఇటువంటి చర్చ జరుగుతున్న సమయంలోనే తాజాగా టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వెంకన్న దర్శనానికి వస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు ధర్మారెడ్డి కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
గతంలో ఎమ్మెల్యేలకు తిరుమలలో గౌరవం ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. టీటీడీ బోర్డు, సీఎంవో ఆఫీసును కూడా ధర్మారెడ్డి లెక్క చేయడం లేదని, సామాన్య భక్తుల సౌకర్యార్థం అనే సాకు చూపి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీటీడీ ఈవోగా కొనసాగేందుకు ధర్మారెడ్డి తపన పడుతున్న విధంగానే, స్వామి వారి దర్శనం కోసం తాము కూడా తపన పడుతున్నామని అన్నారు.
అయితే, తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చే వారందరికీ ఒకే నిబంధన అమలు చేస్తే తాము కూడా సామాన్య భక్తుల మాదిరిగానే దర్శనం చేసుకుంటామని చెప్పారు. ఇటువంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ధర్మారెడ్డి తీరుపై సీఎం జగన్ కు ఫిర్యాదు చేస్తానని అన్నా రాంబాబు చెప్పారు.