ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తమ జిల్లాకు అన్యాయం జరుగుతోందని, జిల్లా కేంద్రం పక్క తమకే కావాలని చాలాచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక, జిల్లాల పేర్లు కూడా మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తొలిసారిగా జిల్లాల విభజనపై సొంతపార్టీలోనూ వ్యతిరేక గళం వినిపిస్తోంది. తాజాగా జిల్లాల విభజనపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాం నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జిల్లాల విభజనపై ఆనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలోని కలవాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలన్న స్థానికులకు మద్దతుగా ఆనం డిమాండ్ చేస్తున్నారు. విభజన జరిగితే సోమశిల, కండలేరు జలాశయాలు 2 జిల్లాల పరిధిలోకి వస్తున్నాయని, దాని ఫలితంగా నీటి వివాదాలు వస్తాయని ఆనం అభిప్రాయపడ్డారు. నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోవడం, ప్రజాప్రతినిధులతో చర్చించకుండా విభజన చేయడం సరికాదని జగన్ నిర్ణయాన్ని ఆనం తప్పుబట్టారు.
రాపూరు, కలువాయి, సైదాపురాన్ని నెల్లూరులోనే ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, ఆ మండలాలను బాలాజీ జిల్లాలో చేర్చడం ప్రజలకు ఇష్టం లేదని అన్నారు. సీఎం జగన్, ఉన్నతాధికారులు ఈ డిమాండ్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 2009 విభజన ప్రక్రియలోనూ రాపూరుకు అన్యాయం చేశారని, కొత్త జిల్లాల విభజన ప్రక్రియలోని లోపాలను సరిదిద్దకుంటే అన్నివిధాలా నష్టమేనని ఆనం హెచ్చరించారు. మరి, ఆనం వార్నింగ్ కు జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.