ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఏకైక విషయం.. వలంటీర్ల వ్యవస్థ. వైసీపీలో అంతర్భాగం అయిన ఈ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా వలంటీర్లను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. వారాహి యాత్ర 2.0లో ఈ విషయాన్ని ఆయన వదిలి పెట్టకుండా.. విమర్శలు గుప్పిస్తూనే ఉన్నా రు. ముఖ్యంగా రాష్ట్రంలో ఒంటరి మహిళలు, వితంతువుల సమాచారం సేకరిస్తున్నారని.. వీరి వివరాలను సంఘవిద్రోహ శక్తులకు అప్పగిస్తున్నారని.. పవన్ చేసిన విమర్శలు సంచలనంగానే మారాయి. దీనిపై రాజకీయంగా వివాదాలు ఎలా ఉన్నా.. పదే పదే పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
దీనిపై గ్రామ స్థాయిలోనూ చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు వలంటీర్లను అన్ని విధాలా ప్రజలు నమ్మారు. వారు కూడా అన్ని రకాలుగాప్రజలకు సేవలు అందించారు. ఈ విషయంలో ఎలాంటి సందేహంలేదు. అయితే.. తెరచాటుగా జరుగుతున్నకొన్ని కార్యక్రమాలు కూడా వలంటీర్ల ప్రమేయం ఉన్నదనే విషయాన్ని ఇప్పుడు తెరమీదికి తెస్తుండడంతో వాటిలో నిజానిజాలు ఏంటనేది సామాన్య ప్రజల మధ్య చర్చకు వస్తున్నది. దీంతో వలంటీర్ వ్యవస్థ ఎన్నికలకు ముందు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు వైసీపీ సర్కారుకు ఏం చేయాలని అనిపించినా.. ప్రజలు ఏం చెప్పాలని అనుకున్నా.. వలంటీర్ల ద్వారనే జరుగుతోంది.
అలాంటి వలంటీర్లపై ప్రభుత్వం భారీగా ఆధారపడిపోయిందనేది వాస్తవం. ప్రజలు ఏపార్టీకి అనుకూలంగా ఉన్నారు.. ప్రజలు ఎటు మొగ్గు చూపుతున్నారు.. అనేవిషయాలను కూడా వైసీపీ ప్రభుత్వం సేకరిస్తోంది. ఇదే విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. దీంతో వలంటీర్ల వ్యవస్థపై ప్రజల్లో నమ్మసన్నగిల్లే ప్రమాదం అయితే.. పొంచి ఉందని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా ఇదే విషయంపై దృష్టి పెట్టారు. పవన్ వలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేసిన తొలి రెండు రోజులు మౌనంగా ఉన్న వారు.. వెంటనే మీడియా ముందుకు వచ్చేశారు.
పవన్‌పై విరుచుకుపడ్డారు. అయితే.. క్షేత్రస్థాయిలో విపక్షాలు సైలెంట్‌గా.. వలంటీర్లపై ఉన్న కేసులు.. వారు చేసిన చర్యలు వంటివాటిని ఏకరువు పెడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులుపెడుతున్నారు. పలు జిల్లాల్లో అత్యాచార కేసుల్లో వలంటీర్ల అరెస్టులు.. దొంగతనాలు.. లంచాల కేసుల్లో ఇరుక్కోవడం వంటివాటిని ఇప్పుడు ప్రజల మద్యకు తెస్తున్నారు. దీంతో వైసీపీలో అంతర్మథనం ప్రారంభమైంది. ఇప్పటి వరకు వలంటీర్ల వ్యవస్థపై ఆధారపడ్డామని.. ఇప్పుడు ఈ వ్యవస్థ చెడిపోయే ప్రమాదం వచ్చిందని.. దీనివల్ల పార్టీకి ఇబ్బందులు తప్పవని మెజారిటీ నాయకులు గుసగుస లాడుతుండడం గమనార్హం.