కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం అవుతుందా? అంటే.. అవుతుందని, కాదని.. ఇలా రెండు రకాలుగా గత రెండు మూడు మాసాల నుంచి తీవ్ర చర్చ సాగుతోంది. వైసీపీ ఘోర పరాజయం, 11 స్థానాలకే పరిమితం కావడం నేపథ్యంలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యానికి తోడు.. టీడీపీ, జనసేనలు జాతీయ స్థాయిలో బీజేపీతో మచ్చికగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో అటు ఓటమి.. ఇటు పొత్తుల వ్యవహారం వైసీపీకి కాక రేపుతోంది.
మరోవైపు.. తనపై ఉన్న అక్రమాస్తుల కేసు, సొంత ఎంపీ అవినాష్‌రెడ్డిపై ఉన్న వివేకా హత్య కేసు ఆరోపణ లు.. వంటివి కూడా జగన్‌కు ఇబ్బందిగానే మారాయి. ఈ నేపథ్యంలో సోదరి షర్మిల దూకుడు.. పార్టీ పతనం వంటివి కూడా ఆయనను ఊపిరి పీల్చుకోనీయకుండా చేస్తున్నాయి. ఇక, ఇప్పుడు ఆయన వీటి నుంచి బయట పడేందుకు.. ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది. దీనిలో భాగంగానే షర్మిలతో రాజీకి వచ్చినట్టు తెలిసింది. అయితే.. ఈ రాజీకి కూడా ఒక కండిషన్ పెట్టినట్టు సమాచారం.
అదే.. కాంగ్రెస్ ఏపీలో పుంజుకునేందుకు జగన్ వంతు సహకారం. ఏ వేలితో అయితే.. కాంగ్రెస్ కంటిని పొడిచారో.. ఆ వేలితోనే కాంగ్రెస్‌ను కాపాడాలన్నది పార్టీ అధిష్టానం సూచనగా ఉంది. అంటే.. కాంగ్రెస్ పార్టీ నేతలను తన పార్టీలోకి తీసుకున్నారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఇప్పుడు అదే జగన్‌తో ఇదే కాంగ్రెస్‌ను నిలబెట్టాలన్నది.. జాతీయ పార్టీ ఆలోచనగా ఉంది. దీంతో వైసీపీ విలీనం వైపు అడుగులు వేసింది. అయితే.. వైసీపీని విలీనం చేయడం జగన్‌కు ససేమిరా ఇష్టం లేదు.
ఈ క్రమంలోనే ఆయన దోస్తీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం చేయడమో.. లేక.. రహస్య ఒప్పందాలు చేసుకుని పార్టీని పుంజుకునేలా చేయడమో వంటివి జగన్ చేయొచ్చు. అది కూడా.. బీజేపీకి ఆగ్రహం తప్పించని విధంగా ఆయన అడుగులు వేయొచ్చు… ఇంతకు మించి.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం అనేది జగన్ చేయరన్నది విశ్లేషకుల మాట. అయితే.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.