సాధారణంగా మనకు బలం, బలగం లేని చోట మన మాట చెల్లదు. మనకు ఎంత మంది మార్బలం ఉన్నా…డబ్బు, పరపతి ఉన్నా….కొన్ని చోట్ల మనం ఏమీ చేయలేని పరిస్థితి. అనువుగాని చోట అధికులమనరాదు…అన్నారు పెద్దలు….కానీ, వైసీపీకి మాత్రం ఈ సూక్తి పెద్దగా తెలిసినట్లు లేదు. అందుకే, అధికారంలో ఉన్నాం కదా అని వైసీపీ తమకు ఇష్టం వచ్చినట్టుగా మూడురాజధానులు వంటి బిల్లులను తమకు సంఖ్యా బలం లేని శాసనమండలిలోనూ పాస్ చేయించుకునేందుకు అడ్డగోలుగా అన్ని ప్రయత్నాలు చేసింది.
అయితే, మండలిలో టీడీపీ సంఖ్యాబలం అధికంగా ఉండడం, మండలి చైర్మన్ షరీఫ్ …వైసీపీ ఒత్తిళ్లకు లొంగకుండా దీటుగా వ్యవహరించడంతో వైసీపీ పప్పలు ఉడకలేదు. దీంతో, ఇగో హర్ట్ అయిన జగన్…ఏకంగా మండలినే రద్దు చేయాలని నిర్ణయించారు. కానీ, దీనికి కేంద్రం నుంచి విముఖత వ్యక్తం కావడం, ఎమ్మెల్సీ పదువుల కోసం ఎదురు చూస్తున్నవారికి న్యాయం చేయకపోతే వ్యతిరేకత వస్తుందన్న కారణంతో మండలి రద్దు వ్యవహారం అటకెక్కింది. దీంతో, మండలిని కొనసాగించాలని నిర్ణయించిన జగన్…మండలిలో బలం పెంచుకునే సమయం వరకు గమ్మునున్నారు.
ఇక, తాజాగా గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలో చేరడంతో జగన్ కల నెరవేరనుంది. ఆ నలుగురి చేరికతో పాటు మరికొందరు సభ్యులు పదవీ విరమణ చేయనుండడంతో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సమీకరణాలు మారనున్నాయి. మండలిలో రేపటి నుంచి వైఎస్సార్సీపీ సంఖ్యాబలం పెరగనుంది. రానుంది. మండలి నుంచి ఏడుగురు టీడీపీ సభ్యులు రిటైర్ కానుండంతో మండలిలో టీడీపీ సంఖ్యాబలం 22 నుంచి 15కు పడిపోయింది.
తాజాగా నామినేట్ అయిన నలుగురితో కలిపి మండలిలో వైసీపీ బలం 21కి పెరగనుంది. వైఎస్సార్సీపీ సభ్యుడు ఉమ్మారెడ్డి కూడా రిటైర్ కానున్నారు. ఈ రకంగా ఇన్నాళ్లకు మొత్తానికి జగన్ కల నెరవేరిందన్నమాట. మరి, సంఖ్యా బలం పెరిగినప్పటికీ మండలి రద్దుకే జగన్ మొగ్గు చూపుతారా…మడమ తిప్పి మండలిని కొనసాగిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.