గత ఐదేళ్ల పాలనలో లోపాలకు వైసీపీ తగిన మూల్యం చెల్లించుకుంది. వై నాట్ 175 అన్న పరిస్థితి నుండి కనీసం 17 స్థానాలు గెలుచుకోలేని స్థితికి దిగజారింది. రాత్రి 8 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీడీపీ 135 స్థానాల్లో గెలుపొంది ఒక స్థానంలో లీడింగ్ లో ఉంది. వైసీపీ 10 స్థానాలలో గెలుపొందింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాలలో విజయం సాధించి టెక్నికల్ గా ప్రతిపక్ష హోదా దక్కించుకుంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు వీడ్కోలు పలుకుతూ ప్రజలు టీడీపీ కూటమికి ఘనవిజయం అందించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఏ దశ లోనూ వైసీపీ కనీస స్థాయిలో కూడా కూటమికి పోటీ ఇవ్వలేక పోయింది. ‘వార్ వన్ సైడ్’ అన్నట్లుగా రాష్ట్రంలో దాదాపు 90 శాతం స్థానాల్లో కూటమి దుమ్ము లేపింది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు జరిగిన అన్ని రౌండ్లలోనూ వైసీపీ చతికిల పడింది.
ప్రజా తీర్పు స్పష్టం కావడంతో పలుచోట్ల ఆ పార్టీ అభ్యర్థులు లెక్కింపు కేంద్రాల నుంచి ఇంటి ముఖం పట్టారు. వాస్తవానికి 175 ఎమ్మెల్యేలున్న ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే
కనీసం 18 మంది ఎమ్మెల్యేలను ఒక పార్టీ గెలవాల్సి ఉంటుంది. కానీ, వైసీపీ 10 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. వైసీపీకంటే మెరుగ్గా జనసేన పోటీ చేసిన 21 స్థానాలలో గెలుపొందింది. అయితే, ఎన్డీఏ కూటమిలో జనసేన భాగస్వామి అయినందున ప్రతిపక్ష హోదాలో ఉండే అవకాశం లేదు. కాబట్టి, 10 స్థానాలున్నా వైసీపీకే ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.