గ్రామీణ ఓటు బ్యాంకు సాయంతో గత ఎన్నికల్లో భారీ మెజారిటీ దక్కించుకున్న వైసీపీకి.. ఇప్పుడు ఈ ఓటు బ్యాంకు పూర్తిస్థాయిలో అందివచ్చేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. టీడీపీ గ్రామీణ స్థాయిలో చేస్తున్న వ్యూహాత్మక ప్రచారమేనని చెబుతున్నారు. మేలో నిర్వహించిన మహానాడులో వచ్చే ఎన్నికలకు సంబంధించి మినీ మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే.. దీనిపై ఒకవైపు పట్టణాలు, నగరాల్లో చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకష్ సహా మాజీ ఎమ్మెల్యేలు, ఆశావహ అభ్యర్థులు కూడా.. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఎటొచ్చీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ విషయంపై ప్రధానంగా చర్చ సాగడం లేదని.. వారం కిందట చంద్రబాబుదృష్టికి వచ్చింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన మండలస్థాయిలోను, గ్రామీణ స్థాయిలోనూ.. చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టారు.
ఈ క్రమంలో గ్రామీణ స్థాయిలో ప్రచారం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా మహిళా నాయకులు.. బస్సు యాత్రలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఉన్న అన్ని గ్రామాల్లోనూ పర్యటిస్తు న్నారు. మినీ మేనిఫెస్టోలోని ప్రతి విషయాన్నీ కూడా.. పూస గుచ్చినట్టు వివరిస్తున్నారు. అదేవిధంగా ఇంటింటికీ వెళ్లి గృహిణులకు జరిగే మేలును.. యువతులకు ఇస్తామన్న రూ.1500 అంశాన్ని కూడా వివరిస్తు న్నారు.
దీంతో గ్రామీణ స్థాయిలో ప్రజల మద్య మినీ మేనిఫెస్టోపై చర్చ సాగుతుండడం గమనార్హం. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఈ బస్సు యాత్రలు సాగుతున్నాయి. ఇక, పురుష నాయకులు.. బస్సు యాత్రల ద్వారా మండలాల్లో తిరుగుతున్నారు. ముఖ్యంగా నారాలోకేష్ చేస్తున్న పాదయాత్ర ముగిసిన జిల్లాల్లో మరింత ఎక్కువగా నాయకులు తిరుగుతున్నారు. ఎన్నికల సమయం వరకు ఈ వేడి తగ్గకుండా చూసుకుంటున్నారు.