ఇన్ని రోజులు ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే రాజకీయ కాంక్షతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడిపై వైసీపీ నాయకులు తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు. మరింత దిగజారి వ్యక్తిగత విమర్శలకూ పాల్పడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం బాబు ఎక్కడా అంటూ టెన్షన్ పడుతున్నారు. కాస్త బాబు జాడ చెప్పండయ్యా అని అడుగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎలాగో వైసీపీ ఓటమి ఖాయమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాబు, లోకేష్ కనిపించకపోవడంతో వైసీపీ నేతల్లో గుబులు మొదలైందనే టాక్ వినిపిస్తోంది. తమను బుక్ చేసే పనులు ఏం చేస్తున్నారో అని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.
పోలింగ్ ముగియగానే జగన్మోహన్ లండన్ వెళ్లిపోయారు. మళ్లీ ఆయన తిరిగి రారేమోనని విపక్షాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు కూడా విదేశీ పర్యటనకు వెళ్లారు. అంతకంటే ముందే లోకేష్ కూడా వెళ్లారు. కానీ వీళ్లు వీదేశీ పర్యటనలకు వెళ్లినట్లు చాలా మందికి తెలియదు. ముఖ్యంగా వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు. బాబు అమెరికా వెళ్లారా? లేదా ఇటలీ వెళ్లారా? అక్కడ ఏం చేస్తున్నారని ఆరా తీస్తున్నారని సమాచారం.
దీంతో బాబు ఎక్కడ ఉన్నారంటూ వైసీపీ నాయకులు తెగ టెన్షన్ పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇక దీనిపై ఇప్పటి నుంచి నెగెటివ్ ప్రచారానికి వైసీపీ తెరలేపింది. చంద్రబాబు ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్లి కుట్రలు చేస్తున్నారని జోగి రమేశ్ మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక భయం కనిపిస్తుందని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. ఫలితాలు జూన్ 4న వెలువడుతాయి. ఈ లోపు బాబు ఏం కుట్ర చేయగలరు? ఇది పూర్తిగా వైసీపీ నాయకుల భయం కారణంగా వస్తున్న ఆరోపణలు మాత్రమే అని టీడీపీ వర్గాలు అంటున్నాయి.