టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు, సామాన్యులు సైతం నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలలోనేే తాజాగా ఏపీలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు. వైసీపీకి రాజీనామాలు చేసి టీడీపీలో చేరి తమ నిరసనను వ్యక్తం చేశారు.
గిద్దలూరు జడ్పీటీసీ సభ్యుడు బుడతా మధుసూదన్ యాదవ్‌తోపాటు మరో ముగ్గురు సర్పంచ్‌లు, ముగ్గురు మాజీ సర్పంచ్‌లు, పలువురు ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, పలువురు వైసీపీ నాయకులు మూకుమ్మడిగా టీడీపీలో చేరారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయనకు మద్దతుగా నిలవాలని టీడీపీలో చేరుతున్నామని వారంతా ప్రకటించారు. గిద్దలూరు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో వారు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు.
టీడీపీలో చేరకుండా వారిని అడ్డుకునేందుకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి విఫలయత్నాలు చేశారు. వైసీపీ నేతలు, పోలీసుల ఆంక్షలను అధిగమించి వారు టీడీపీలో చేరారు. ఈ చేరికలు వైసీపీ నేతలను కలవరానికి గురి చేశాయి. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, పలు నియోజకవర్గాల ఇన్చార్జిలు హాజరయ్యారు.