ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా! అన్న సామెతను వైసీపీ నాయకులు రుజువు చేస్తున్నారు. ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో.. వైసీపీ నేతలు.. కొందరు అధికారులను బెదిరించడం.. సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. “వైసీపీ ఉన్నంత వరకు.. మేం చెప్పిందే వేదం.. మా మాట కాదంటే ఇంటికే“ అని తహసీల్దార్ స్థాయి అధికారిని బెదిరింపుల కు గురి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
కడపలోని బ్రహ్మంగారిమఠంలో జడ్పీటీసీ సభ్యుడొకరు తహసీల్దారును ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తహసీల్దారు కిశోర్కుమార్రెడ్డిపై స్థానిక వైసీపీ నాయకులు ఒత్తిడి పెంచారు. తాము చెప్పిన వారికే పథకాలు ఇవ్వాలని, అసైన్మెంట్లో భూములు ఇవ్వాలని అధికారపార్టీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో తమకు అర్హత ఉందంటూ పలువురు అసైన్మెంట్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నారని, ఈ విషయంలో అర్హత, అనర్హతలను తేల్చాలంటే ఒత్తిళ్లు తట్టుకోలేక పోతున్నామంటూ రెండురోజుల క్రితం తహసీల్దార్ చెప్పారు.
దీనిపై అధికార పార్టీ నాయకులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో జడ్పీటీసీ సభ్యుడు రామగోవిందురెడ్డి తన అనుచరులతో కలసి తహసీల్దార్ వద్దకు వచ్చి.. ‘అధికారులు ఈ రోజు ఉంటారు రేపు పోతారు. వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు మేముంటాం. మే చెప్పిందే వినాలి’’ అంటూ జడ్పీటీసీ రామగోవిందురెడ్డి హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తానికి ఈ పరిణామంతో వైసీపీ మరింత పలుచన అవుతోందని పార్టీ సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా.. ఇలాంటి నేతలను కట్టడి చేయాలని కోరుతున్నారు.