“మన పార్టీ మళ్లీ గెలవాలి. మనం మళ్లీ అధికారంలోకి రావలి. ఆ దిశగా అందరూ కృషి చేయండి. ప్రతి ఒక్కరూ ముందుకు సాగండి. నేను బటన్ నొక్కగానే ఆ ఫలితాలను మీరు ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రచారం చేయండి“- ఇదీ.. నాలుగు మాసాల కిందట వరకు వైసీపీ అధినేత, సీఎం జగన్ తన వర్గానికి పూస గుచ్చినట్టు పదే పదే చెప్పిన మాట.
ఇప్పుడు టంగ్ మారింది. “నన్ను సీఎంను చేయాలని లేదా. మీ వల్ల నేను సీఎం సీటుకు దూరమవుతు న్నాను. నేను గెలిస్తే.. సీఎం అయితేనే మీకు భవిష్యత్తు. నన్ను సీఎంను చేసేందుకు ముందుకు కదలండి“ ఇదీ.. ఇప్పుడు అదే సీఎం చెబుతున్న మాట. విశాఖ నుంచి అనంతపురం వరకు ఆయన ఎక్కడ పర్యటించినా.. నాయకులకు చెబుతున్న మాట ఇదే!
మరి ఇంత మార్పు ఎందుకు వచ్చింది? మనం నుంచి నేను కు ఎందుకు మారారు? అనేది వైసీపీలో కలవరపాటుకు గురి చేస్తున్న విషయం. వైసీపీ నాయకులు ఎక్కడ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. సీఎం జగన్ను ప్రస్తుతిస్తున్నారు. ఆయన చేస్తున్న పనులనే ఏకరువు పెడుతున్నారు. ఆయనను గెలిపించాలని కోరుతున్నారు. ఆయన ఉంటేనే మీకు సంక్షేమం వస్తుందని కూడా చెబుతున్నారు.
అయినప్పటికీ.. సీఎం జగన్ ఎక్కడా సంతృప్తి చెందుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడికక్కడ ఇంకా తన ప్రచారం జోరుగా సాగాలని కోరుకుంటున్నారు. మరి దీనికి కారణం.. టీడీపీ-జనసేన పొత్తుతో తన ఇమేజ్ తగ్గుతోందని అనుకుంటున్నారా? లేక.. చంద్రబాబుతో తాను సరితూగే పరిస్థితి తగ్గుతోందని భావిస్తున్నారా? అనేది వైసీపీలో చర్చగా మారింది. మరి ఎన్నికల నాటికి ఈ దూకుడు ఇంకా ఎంత మేరకు పెరుగుతుందో చూడాలి.