కొన్ని సందర్భాల్లో మాటల కంటే మౌనం మంచిది. ఆ విషయాన్ని వైసీపీ నేతలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఇప్పటికే మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ఆ పార్టీ.. తనను ప్రశ్నించే వారికి సమాధానాల్ని చెప్పలేక సతమతమవుతోంది. ఎక్కడో మొదలైన ఈ హత్య కేసు వ్యవహారం ఇప్పుడు అటు ఇటు తిరిగి.. చివరకు తాడేపల్లి ప్యాలెస్ లో పని చేసే వారి వరకు వచ్చేయటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ఓఎస్డీగా పని చేస్తున్న క్రిష్ణమోహన్ రెడ్డితో పాటు.. సీఎం సతీమణి వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్న నవీన్ లు విచారణకు హాజరయ్యారు. దాదాపు ఆరున్నర గంటల పాటు వారి విచారణ సాగింది. ఇదిలా ఉంటే.. ఈ విచారణ పర్వం ఎక్కడివరకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ కేసుకు సంబంధించి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. వాటి విషయంలో స్పందిస్తున్న కొందరు వైసీపీ నేతల మాటలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి.
ఈ కేసు నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యనేతల్లో కొందరు కడిగిన ముత్యాల మాదిరి బయటకు వస్తారని చేస్తున్న వ్యాఖ్యలు ఏ మాత్రం సరికావంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ కంటే ఎక్కువగా జరుగుతుందంటున్నారు. సున్నిత విషయాల మీద దూకుడుగా రియాక్టు కావటం సరికాదన్న మాట తరచూ వినిపిస్తోంది. అయినప్పటికీ తీరు మార్చుకోని వైసీపీనేతల కారణంగా పార్టీకి.. పార్టీ అధినేతకు కొత్త తలనొప్పులు తప్పవంటున్నారు.
అందుకే.. వివేకా హత్య విషయంలో అనవసర వ్యాఖ్యల కంటే కూడా మౌనమే మంచిదన్న మాట వినిపిస్తోంది. అనవసరమైన విశేషణాలను కట్టిపెట్టి.. ఆచితూచి మాట్లాడితే మంచిదంటున్నారు. సీబీఐ విచారణ కీలక దశకు చేరకొని.. కొత్త అంశాలు వెలుగు చూస్తున్న వేళ.. జరుగుతున్న పరిణామాల మీద తొందరపాటుకు గురి కాకుండా ఉండటమే మంచిదన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ విషయాన్ని వైసీపీ నేతలు ఎంతవరకు గుర్తిస్తారో చూడాలి.