ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరాతి ఘోరమైన ఓటమి చవిచూసిన వైసీపీ కి.. ఆ ఓటమిని జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే ఆశ్చర్యం, నిర్వేదం నుంచి బయటికి వచ్చి ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. కొందరేమో ఈ ఓటమికి జగన్ వ్యవహార శైలి, ఆయన పాలనే కారణమంటూ విమర్శలు చేస్తుంటే.. మరికొందరు సజ్జల రామకృష్ణారెడ్డిదే ఈ పాపమంతా అంటూ ఆయన మీద విరుచుకుపడుతున్నారు.
మరోవైపు 2019లో వైసీపీ గెలుపు కోసం గట్టిగా కృషి చేసి విజయానంతరం క్రెడిట్ తీసుకున్న ఐప్యాక్ సంస్థ మీద వైసీపీలో చాలామంది నేతలు, కార్యకర్తలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. స్వయంగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఐప్యాక్‌ను ఒక పనికి మాలిన సంస్థగా అభివర్ణించారు. తాజాగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఐప్యాక్ తీరును దుయ్యబట్టారు.
జగన్ పేరు ఎత్తకుండా ఐప్యాక్ అనే ఒక పనికి మాలిన సంస్థను తీసుకొచ్చి పెట్టారని కొట్టు సత్యనారాయణ ఆక్రోశం వెళ్లగక్కారు. ఆ సంస్థను నడిపించే వ్యక్తులందరూ సన్నాసులని ఆయన పే్కొన్నారు. వాళ్లు ఐఐటీ కాన్పూర్‌లో, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివామనో.. ఐఐఎం బెంగళూరులో చదివామనో చెప్పుకుంటూ రాజకీయాలకు పనికి రాని డిగ్రీలు పెట్టుకుని వైసీపీని నాశనం చేశారని ఆయన ఆరోపించారు. వాళ్ల పబ్బం గడుపుకోవడానికి.. ప్రాబల్యం నిలబెట్టుకోవడానికి.. ఇక్కడున్న ప్రజాప్రతినిధులను నిర్వీర్యం చేయడానికి పరోక్షంగా పని చేశారని కొట్టు అన్నారు.
వ్యతిరేకత ఉన్న కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలను ఎంచుకుని.. వారితో పాటు రాష్ట్రంలో పలువురు నాయకుల మీద వ్యతిరేకంగా జగన్‌కు నివేదికలు ఇచ్చారని.. దీంతో ఆయన ఇష్టానుసారం ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేశారని కొట్టు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా వైసీపీ పతనంలో ఐప్యాక్ పాత్ర కీలకమన్నట్లు ఆయన మాట్లాడారు.