పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. నాలుగు దశల్లో జరిగిన ఈ ఎన్నికలు ముగిశాయి. అయితే.. ఇంకా పల్లెల్లో మాత్రం ఈ ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. ఎక్కడికక్కడ అధికార వైసీపీ నేతలు దూకుడు గానే ఉన్నారు. తమకు ఓట్లు వేయలేదనే అక్కసుతోపాటు టీడీపీకి ఓట్లు వేశారనే ఆగ్రహంతో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. కొన్ని చోట్ల వైసీపీ నాయకులు ఏకంగా భౌతిక దాడులకు దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పైగా.. అధికారులు కూడా వైసీపీ నాయకులకు సహకరిస్తుండడం మరింత వివాదంగా మారింది.
ఉదాహరణకు గుంటూరు జిల్లాను తీసుకుంటే.. జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ నేతల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పమిడిపాడు పంచాయతీలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించలేదనే అక్కసుతో 150 మంది వృద్ధులు, వికలాంగుల పింఛన్లను వైసీపీ నేతలు నిలిపివేశారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1నే పింఛన్లు పంపిణీ చేశారు. కానీ, ఇక్కడ మాత్రం ఇవ్వలేదు. దీనిపై అధికారులను అడిగినా స్పందన రాకపోగా.. తమకు తెలియదని సమాధానం చెబుతున్నారు. వైసీపీ నేతల అరాచకాన్ని నరసరావుపేట సబ్ కలెక్టర్, ఎంపీడీఓకి పమిడిపాడు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
ఇక, కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని గంపల గూడెం పరిధిలోనూ పింఛన్లను నిలిపివేయిం చారు వైసీపీ నాయకులు. కొందరిని రోజువారి కూలి పనులు చేయకుండా కూడా అడ్డుకున్నారని తెలిసిం ది. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు వైసీపీ నేతల జులుంతో అల్లాడిపోతున్నారు. మరోవైపు తూర్పుగోదావరిలోని జగ్గం పేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు.. రాత్రి వేళల్లో గ్రామాలకు విద్యుత్‌ను నిలిపివేయిస్తున్నారని ఫిర్యాదులు అందడం గమనార్హం. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు.. గడిచిపోయిన పంచాయతీ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని.. తమ అభ్యర్థులను గెలిపించలేదనే అక్కసుతో దాడులు చేయడం గమనార్హం.