చాలా కాలం తర్వాత దేశ రాజధానిలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్రం నుంచి ఆహ్వానంతో పాటు.. వ్యక్తిగతంగా చంద్రబాబుకు ఫోన్ చేసిన నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లటం తెలిసిందే. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. బాబును చూసి పలుకరించి.. ఆయన్ను పక్కకు తీసుకెళ్లి ఐదు నిమిషాలు మాట్లాటం తెలిసిందే. ఈ అంశం పెను చర్చగా మారటం.. అధికార వైసీపీ నేతలు విరుచుకుపడటం.. పచ్చకుల మీడియా అనవసరంగా హైలెట్ చేస్తుందని.. ఢిల్లీలో చంద్రబాబుకు అంత సీన్ లేదంటూ.. తమ అధినేతకు ఎంత పలుకుబడి ఉందన్న విషయాన్ని చెప్పుకోవటానికి పడిన ప్రయాస అంతా ఇంతా కాదు.
చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి.. అక్కడ ఆయనకు ఆదరణ లభిస్తే వైసీపీ నేతలకు ఎందుకంత ఉలికిపాటు? అన్నది ప్రశ్న. తమకు మిత్రుడిగా మోడీ ఉన్నారని.. ఆయన ఆశీస్సులు దండిగా ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతుంటారు. అందుకు భిన్నంగా చంద్రబాబుకు మోడీ క్లోజ్ అయితే.. చివరకు అదెక్కడ తమకు ఇబ్బందికరంగా మారుతుందన్నది వైసీపీ నేతల ఆలోచనగా చెబుతున్నారు. నిజానికి అవసరానికి మించి బాబు పర్యటనను హైలెట్ చేసిం వైసీపీ నేతలన్న విషయాన్ని మర్చిపోకూడదు. మీడియాలో పెద్దగా ఫోకస్ కాకున్నా.. అలా పోకస్ అయ్యిందన్న వైసీపీ నేతల భావనతో.. చంద్రబాబును విమర్శించేందుకు వైసీపీ నేతలు అనవసర ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఇప్పటికే అలాంటి పనులు చేయటం ద్వారా.. చంద్రబాబుకు అవసరానికి మించిన ప్రచారాన్ని కల్పించటంలో వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారు. నిజానికి తెలుగు తమ్ముళ్లు చేయాల్సిన పనిని తొందరపాటుతో వైసీపీ నేతలే చేశారని చెప్పాలి. బాబు ఢిల్లీ పర్యటనపై వైసీపీ నేతలు ఆగమాగం అవుతున్న వేళ.. టీడీపీ నేతలు రియాక్టు అవుతున్నారు. తాజాగా సీనియర్ నేత.. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్పందించారు. సుదీర్ఘ కాలం తర్వాత తమ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లగా.. తమ అధినేతను ఢిల్లీలోని అన్ని పార్టీల నేతలు.. కేంద్రప్రభుత్వ పెద్దలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.
సీనియర్ రాజకీయ నేతగా చంద్రబాబుకుఅత్యున్నత స్ట్రేచర్ ఉందని.. అది వైసీపీ అర్థం కాదన్న పయ్యావుల.. ‘ఒక్క టూర్ తో ఢిల్లీలో వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు సగం కొట్టుకుపోయాయి. ఒక్కరోజు చంద్రబాబు ఢిల్లీలో ఉంటే వైసీపీకి ఎందుకో ఉలిక్కిపడుతోంది’ అంటూ చేసిన విమర్శ వైసీపీ నేతలకు సూటిగా తగులుతుందని చెప్పక తప్పదు. అనవసర ఉలికిపాటు తెలుగు తమ్ముళ్లకు మరింత యాక్టివేట్ అయ్యేలా చేస్తుందన్న విషయాన్ని వైసీపీ నేతలు ఎందుకు మిస్ అవుతున్నట్లు?