సొమ్మొకడిది సోకొకడిది అన్న రీతిలో వైసీపీ నేతల తీరు ఉందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో నాటి సీఎం చంద్రబాబు మొదలుబెట్టి 95 శాతం పూర్తి చేసిన హంద్రీనీవా వంటి ప్రాజెక్టులను జగన్ గాలికొదిలేశారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. అయితే, గతంలో చంద్రబాబు దాదాపుగా పూర్తి చేసిన కొన్ని పనులకు ఫినిషింగ్ టచ్ ఇచ్చిన జగన్…ఆ క్రెడిత్ అంతా తన ఖాతాలో వేసుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా గుడివాడలో టీడీపీ హయాంలో దాదాపుగా పూర్తయిన టిడ్కో ఇళ్లకు రంగులు పూసిన వైసీపీ నేతలు…వాటిని తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ నేతలపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తాము కట్టిన ఇళ్లకు వైసీపీ రంగులేసుకుని తామే కట్టినట్లు బిల్డప్ ఇస్తున్నారని ఉమ విమర్శలు గుప్పించారు. టిడ్కో ఇళ్లను టీడీపీ నిర్మించిన విషయం కొడాలి నానికి తెలియదా? అని ప్రశ్నించారు.
నాలుగేళ్లుగా మూలన పడేసిన ఇళ్లను ఎన్నికల ముందు హడావుడిగా రంగులేసి తమ ఖాతాలో వేసుకోవడం గొప్ప అనుకుంటున్నారని దుయ్యబట్టారు. భవనాలు నిర్మించిన వారిని బిల్డర్లు అంటారని, రంగులేసే వారిని పెయింటర్లు అంటారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో 12 లక్షల ఇళ్లు నిర్మించామని, నాలుగేళ్లలో వైసీపీ కట్టిన ఇళ్లు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. మరి, ఉమ వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.