ఒంగోలు వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తా గురించి ఇరు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర లేదు. ఒకే ఒక్క వీడియోతో ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో గుప్తా పాపులర్ అయ్యారు. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ గుప్తా చేసిన కామెంట్లు అధికార పార్టీలో కాక రేపాయి. వైసీపీ కార్యకర్తను అంటూనే సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్న గుప్తాపై ఆ పార్టీ నేతలు దాడి చేయడం పెను దుమారం రేపింది.
ఆ తర్వాత గుప్తాను బాలినేని బుజ్జగించడంతో ఆ వ్యవహారం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా గుప్తా…ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా తనకు ప్రాణహాని ఉందని, అమిత్ షానే తనను కాపాడాలని ప్లకార్డు పట్టుకొని దర్శనమివ్వడంతో మరోసారి గుప్తా పేరు వార్తల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా గుప్తా మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు గుప్తా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక, హస్తినాపురిలో ఉన్న నర్సాపురం ఎంపీ రఘురామను కూడా గుప్తా కలిశారు. అంతేకాదు, అమిత్ షాతో సుబ్బారావు భేటీకి రఘురామ రాయబారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడిమాలో ఆర్ఆర్ఆర్ తో గుప్తా దిగిన ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు ఈ విధంగా కామెంట్లు పెడుతున్నారు. వైసీపీ రెబల్ నేతలిద్దరూ ఒకే చోట చేరారని, వీరిద్దరూ కలిసి రచ్చబండ పెట్టాలని అంటూ సెటైర్లు వేస్తున్నారు.