ఏ పార్టీలో అయినా అధినేత చెప్పిందే వేదం…చేసిందే న్యాయం. అయితే, చాలా పార్టీల్లో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కీలక నేతలకు అధినేతతో తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం వస్తుంది. ఆ అభిప్రాయాన్ని అధినేత పరిగణలోకి తీసుకున్నారా లేదా అన్నది వేరే విషయం. కానీ, ఏపీలో వైసీపీ అధినేత జగన్ తీరు మాత్రం ఇందుకు భిన్నం అన్న వాదనలున్నాయి. జగన్ తన చుట్టు ఓ కోటరీని ఏర్పాటు చేసుకున్నారని, వారికి మాత్రమే జగన్ ఎల్లపుడు అందుబాటులో ఉంటారన్న ఆరోపణలున్నాయి.
ఇక, వారిచ్చిన సలహాలు మాత్రమే పాటించే జగన్….చాలామంది ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరన్న ప్రచారం జరుగుతోంది. ఇక, మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలయితే….జగన్ చుట్టు ఉంటే ప్రభుత్వ పెద్దలు, సలహాదారులు చెప్పింది వినడమే తప్ప వారికి మాట్లాడే అవకాశమే రాదని టాక్. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ లోగుట్టును ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రట్టు చేశారు. ఓ వైసీపీ ఎమ్మెల్యేపై ప్రభుత్వ పెద్ద ఒకరు చేయిచేసుకున్నారని ఆయన ఆరోపించారు.
అంతేకాదు, సదరు ఎమ్మెల్యేపై ఆ పెద్దాయన చేయిచేసుకున్నట్లు తన దగ్గర పక్కా సమాచారం ఉందన్నారు. ఇక, ఆ ఎమ్మెల్యేపై చేయిచేసుకున్న విషయం త్వరలోనే బయటకు పొక్కుతుందని జోస్యం చెప్పారు ఆర్ఆర్ఆర్. తమ పార్టీలోని ఎంపీకి, ఎమ్మెల్యేకు మధ్య ఆధిపత్యపోరు వల్లే ఆ ఘటన జరిగిందని కూడా లీక్ చేశారు రఘురామ. అయితే, తాను పార్టీ మారబోతున్నానన్న ప్రచారంపై కూడా రఘురామ స్పందించారు.
ప్రస్తుతం తాను సొంతింటిని చక్కదిద్దే పనిలో ఉన్నానని, చక్కదిద్దలేకపోతే పక్క పార్టీల వైపు చూస్తానని క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కక్ష సాధించేందుకు మాత్రమే సినిమా టికెట్ల ధరల అంశాన్ని తమ ప్రభుత్వం రచ్చ చేస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వ తీరుతో క్వాలిటీ సినిమా తీసే పరిస్థితులు ఇకపై ఉండకపోవచ్చన్నారు. 5రూపాయలతో సులభ్ కాంప్లెక్స్‌లో టాయిలెట్ కు కూడా వెళ్లలేమని, అటువంటిది రూ. 5 తో సినిమా చూపిస్తున్న సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్ అని చురకలంటించారు.