అధికార పార్టీకి చెందిన మహిళా నేత ఒకరు నకిలీ నోట్ల చలామణి కేసులో అరెస్టు కావడం సంచలనం రేపుతోంది. వైసీపీ మహిళా నేత రసపుత్ర రజినిని నకిలీ నోట్ల వ్యవహారంలో బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న వైనం ఇపుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. సదరు వైసీపీ మహిళా నేతతోపాటు చరణ్ సింగ్ అనే మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరి వద్ద నుంచి రూ.44 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ గా వ్యవహరించిన రజిని పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. అయితే, మరోసారి రజినికి అదే పదవిని ఇస్తూ పదవీ కాలం పొడిగిస్తూ జగన్ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె దొంగనోట్ల వ్యవహారంలో అడ్డంగా బుక్ కావడంతో అధికార పార్టీ చిక్కుల్లో పడింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రసపుత్ర రజిని.. కడప వైసీపీలో యాక్టివ్ గా ఉంటారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో ఆమెకు పరిచయాలున్నట్లు తెలుస్తోంది.
అనంతపురానికి చెందిన కొందరి నుంచి నకిలీ నోట్లు కొని బెంగళూరులో వాటిని రజిని సర్క్యులేట్ చేస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే, దొంగనోట్ల వ్యవహారంతో తనకేం సంబంధం లేదని రాచమల్లు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో రజిని పాత్ర తేలితే పార్టీపరంగా ఆమెపై చర్యలు తీసుకుంటామన్నారు. రజిని..గతంలో రాచమల్లు, వైఎస్ విజయమ్మ, సజ్జల, రోజాలతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కర్ణాటక పోలీసులకు కాబట్టి రజిని దొరికిందని, ఏపీలో అయితే విషయం బయటకు వచ్చేది కాదని ట్రోలింగ్ జరుగుతోంది. అంతేకాదు, కర్ణాటక పోలీసులకు చిక్కిన ఈ వైసీపీ నాయకురాలు, సలహాదారుడు సజ్జల స్నేహితురాలు అని, రాష్ట్రంలో ఎన్ని కోట్ల రూపాయల దొంగ నోట్లు పంపిణీ చేసిందోనని కామెంట్లు వస్తున్నాయి. ఇక, వాలంటీర్ల వద్ద దొరుకుతున్న దొంగ నోట్లు ఇవేనా? ఎవరి వాటా ఎంత? దీనిపై విచారణ జరిపించాలని నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు.