అంచనాలకు తగ్గట్లే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రియాక్టు అయ్యారు. కాకుంటే.. ఇప్పుడు చేసిన పనే రెండు వారాల క్రితమే చేసి ఉంటే మరింత బాగుండేది. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.. కొన్ని వేల గంటలు టీవీ చానళ్లలోనూ.. కొన్ని లక్షల గంటలు యూట్యూబ్ చానళ్లలోనూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు వివాహేతర సంబంధ అంశం రచ్చ రచ్చగా మారటం తెలిసిందే.
దేశంలో మరే సమస్య లేనట్లుగా కొన్ని ప్రైవేటు పంచాయితీల్ని పబ్లిక్ చేసుకోవటం.. వెనుకా ముందు చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి ఎలాంటి షాక్ తగులుతుందో.. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు అలాంటి షాకే ఎదురైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ మీద వేటు వేస్తూ.. తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన భార్య వాణి.. పెద్ద కుమార్తె హైందవిలు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయటం.. వారిని అడ్డుకోవటం తెలిసిందే. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ కు మరో మహిళ కం వైసీపీ కార్యకర్త దివ్వల మాధురితో వివాహేతర సంబంధం ఉందని పేర్కొంటూ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఉన్న కారు షెడ్ లో దీక్ష చేపట్టారు. ఈ వ్యవహారం పలు మలుపులు తిరిగింది. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా దువ్వాడ వ్యవహారమే.
ఇది సరిపోదన్నట్లుగా ఇరు వర్గాల వారు పోలీసు కేసుల వరకు వెళ్లారు. దీంతో.. ఈ వివాదం మరింత ముదిరింది. అంతకంతకూపెరుగుతూ పోతున్న ఈ ఇష్యూను క్లోజ్ చేయటం కోసం ఇరు వర్గాలకు చెందిన వారు రాజీ చర్యల కోసం రంగంలోకి దిగారు. అయినప్పటికీ అనుకున్న రాజీ చర్యలు నెరవేరలేదు. ఇదిలా ఉండగా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూపై సీరియస్ అయ్యారు.
ఎమ్మెల్సీ దువ్వాడ కారణంగా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతోనే వైఎస్ జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల్ని పార్టీ సీనియర్ నేత పేరాడ తిలక్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే.. చేజేతులారా దువ్వాడ శ్రీనివాస్ తనకొచ్చిన అవకాశాల్ని తానే దెబ్బ తీసుకున్నారన్న మాట వినిపిస్తోంది.