బోరుగడ్డ అనిల్ కుమార్… ఆంధ్రా రాజకీయాలతో టచ్ ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే. జగన్ హార్డ్ కోర్ అభిమానిగా, వైసీపీ నేతగా చలామణి అయిన బోరుగడ్డ అనిల్ తన వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. జగన్ అనుమతిస్తే చంద్రబాబుతో పాటు లోకేష్ ని కూడా లేపేస్తానంటూ అనిల్ బహిరంగంగానే పలుమార్లు సంచలన విమర్శలు చేశారు. ఇక, పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా అనిల్ నోరుపారేసుకున్నారు. వైసీపీ నుంచి టిడిపిలోకి మారిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా అనిల్ ఫోన్లో బెదిరించిన ఆడియో రికార్డింగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అయితే, అప్పుడు అధికారం అడ్డుపెట్టుకొని అనిల్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆయనను వేటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బోరుగడ్డ అనిల్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. అయితే, తాజాగా గుంటూరుకు వచ్చిన అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెదిరింపులు, పరువు నష్టం, అసాంఘిక కార్యకలాపాలు వంటి ఆరోపణల నేపథ్యంలో అనిల్ పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోని అనిల్ ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అనిల్ అరెస్ట్ కావడంపై టీడీపీ, జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారని అనిల్ భార్య ఆరోపిస్తున్నారు. అయితే, బోరుగడ్డ అనిల్ అరెస్ట్..మొదలే అని, వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడిన అనిల్ వంటి నేతల లిస్ట్ చాలా ఉందని, వారి అరెస్టు కూడా తథ్యమని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.