వైసీపీ అధిష్టానంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలోనే కోటంరెడ్డిని ఇరుకున పెట్టేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు కోటంరెడ్డిపై బెదిరింపులకు దిగుతుండగా మరికొందరు బూటకపు కేసులు పెట్టి వేధించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నెల్లూరు 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డిని కోటంరెడ్డి కిడ్నాప్ చేశారంటూ వేదయపాలెం పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపుతోంది.
వైసీపీని వీడి తనతో రావాలంటూ విజయభాస్కర్ రెడ్డిని కోటంరెడ్డి కోరారని, విజయ భాస్కర్ రెడ్డి దానికి నిరాకరించడంతో ఆయనను కిడ్నాప్ చేయించారని వేదయపాలెం ఎస్సై కె.నరసింహారావు వెల్లడించారు. తన డ్రైవర్, అనుచరుడితో కలిసి విజయ భాస్కర్ రెడ్డిని కోటంరెడ్డి బెదిరించారని ఆయన తెలిపారు. విజయభాస్కర్ రెడ్డిని బలవంతంగా కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా ఆయన తప్పించుకుని వేదయపాలెం పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించారు.
అయితే, తనతో కలిసి వస్తానని విజయభాస్కర్ రెడ్డి చెప్పారని, కానీ చివరి నిమిషంలో తనను హత్తుకొని కంటతడి పెడుతూ తన దగ్గర నుంచి వెళ్లిపోయారని కోటంరెడ్డి చెబుతున్నారు. ఇటువంటి కేసులకు భయపడేది లేదని అంటున్నారు. అంతకుముందు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కడప జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఫోన్ చేసి బెదిరించిన వ్యవహారం సంచలనం రేపుతోంది. సీఎం జగన్, సజ్జల, పార్టీ పెద్దల జోలికొస్తే బండికి కట్టుకుని నెల్లూరు అంగళ్ల మధ్య నుంచి లాక్కెళ్తానంటూ బోరుగడ్డ అనిల్ బెదిరించారని ఓ ఆడియో క్లిప్ లీక్ అయింది.
తాను వైసీపీ మద్దతుదారుడినని చెప్పుకున్న అనిల్…. కోటంరెడ్డి కథ మొత్తం తెలుసని కోటంరెడ్డితో సహా ఆయన సోదరుడిని కూడా తరిమి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. తాను జగన్ ను ఏమీ అనలేదని చెబుతున్నా బూరగడ్డ అనిల్ వినలేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదని కోటంరెడ్డి అన్నారు.