రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన `వైఎస్` వ్యాఖ్యలు అధికార పార్టీలో ఇంకా గుబు లు రేపుతూనే ఉంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి.. రాజ్యాంగాన్ని గౌరవించారని, అధికారులకు స్వేచ్ఛ నిచ్చారని.. వ్యవస్థలను గౌరవించారని.. నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. సాధారణంగా.. ఇలాంటి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు స్పందిస్తాయి. కానీ.. అనూహ్యంగా ఏ ప్రతిపక్షమూ కూడా వీటిని తమకుఅనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయలేదు. కానీ, వైసీపీలో మా త్రం ఈ వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి.
ఇప్పటి వరకు జగన్ తన పాలనను తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మించిన పాలన చేస్తానని ప్రకటించారు. ఎక్కడికి వెళ్లినా.. ఏ మైకు పట్టుకున్నా.. ఆయన ఇదే మాట చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. గత ఎన్నికల్లో నూ తన తండ్రి సెంటిమెంటుతోనే ఆయన ఎక్కువగా ప్రచారం చేసుకున్నారు. గ్రామీణ స్థాయిలో ఇది బాగా వర్కవుట్ అయింది. ఈ పరిణామమే జగన్‌కు అధికారందక్కేలా చేసింది. అయితే.. ఇప్పుడు జగన్ పోకడపై అనేక సందేహాలు.. అనుమానాలు..రాష్ట్ర వ్యాప్తంగా ముసురుకున్నాయి. కోర్టులపై యుద్ధాలు చేయడం నుంచి రాజ్యాంగ వ్యవస్థలతో పేచీ పడడం వరకు గ్రామాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో తాజాగా నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చల్లోకి వచ్చాయి. వైఎస్ తరహాలో జగన్ లేరనే విషయం స్పష్టంగా ఆయన మాటల్లో ధ్వనించింది. దీంతో జగన్ దూకుడుపై చర్చ సాగుతోంది. ఇదే కనుక పునాదులు బలంగా నాటుకుంటే.. మున్ముందు.. జగన్‌కు వ్యక్తిగతంగా నష్టం. ఇప్పటి వరకు జగన్.. తన పార్టీని తనను వేరుగా చూడడం లేదు. నేతలను సైతం నమ్ముకోవడం లేదు. పార్టీ అంటే.. జగన్.. అన్నట్టుగానే ఉంది. ఇప్పుడు అదే జగన్‌పై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత బలపడితే.. వైసీపీ ఉనికికే ప్రమాదం.
ఇప్పుడు ఈ విషయమే.. వైసీపీలో అంతర్మథనంగా సాగుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి అందరూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. చివరకు వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న మాజీ ఎంపీ ఉండవల్లి సైతం.. వైఎస్‌ను కొనియాడుతున్నా.. ఆయనలో ఉన్న లక్షణాల్లో ఒక్కశాతం కూడా జగన్‌లో లేవని పరోక్షంగా దులిపేయడం. ఇప్పుడు నిమ్మగడ్డ సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ ప్రభ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో వైసీపీ తర్జన భర్జన పడుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టేలా.. త్వరలోనే వ్యూహాత్మక కార్యక్రమం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.