వైసీపీలో సీట్లు దక్కవని భావిస్తున్న ఎమ్మెల్యే , ఎంపీలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే కొందరు టీడీపీతో టచ్‌లో ఉండగా.. మరికొందరు జనసేన వైపు చూస్తున్నారు. ఇలాంటి వారిలో ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం గూడూరు నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న మాజీ ఐఏఎస్ అధికారి, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ జనసేన వైపు చూస్తున్నారు. తాజాగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ కూడా అయినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశిస్తున్నారు.
2014కు ముందు జగన్ ఓదార్పు యాత్ర చేసినప్పటి నుంచి వరప్రసాద్.. వైసీపీతోనే ఉన్నారు. ఓదార్పు యాత్రకు కొంత సాయం కూడా చేశారని అంటారు. ఈ క్రమంలోనే ఆయనను తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి అప్పట్లో వైసీపీ నిలబెట్టింది. అసలు గెలుస్తారా? లేదా? అనుకున్న వరప్రసాద్ భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. తిరుపతి డెవలప్మెంట్లో ఆయన పాత్ర కూడా ఉంది. ఇక, 2019 ఎన్నికల సమయానికి ఆయనను తిరుపతి నుంచి తప్పించి.. గూడూరు నియోజకవర్గానికి బదిలీ చేశారు. ఇక్కడ గెలుస్తుందనే నమ్మకం లేకే ఆయనను దింపారనే చర్చ సాగింది.
అయితే.. ఆ ఎన్నికల్లోనూ వరప్రసాద్ ఘన విజయం దక్కించుకున్నారు. మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నించారు. ఎస్సీ కోటాలో అయినా.. తనకు స్థానం దక్కక పోతుందా? అని అనుకున్నారు. కానీ, ప్రాధాన్యం దక్కలేదు. దీనికి తోడు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆయనకు ఎదురీతే ఎదురైంది. అయినప్పటికీ.. వరప్రసాద్ సర్దుకు పోయారు. ఇప్పుడు.. ఏకంగా టికెట్ దక్కదనే చర్చ సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే ఆయనను పక్కన పెట్టి గూడూరు సీటును మరో నేత మేరిగ మురళికి పార్టీ కేటాయించింది. దీంతో ఆయన తీవ్ర మనస్థాపంతో ఉన్నారు.
అయితే.. టీడీపీలో చేరాలని ముందుగా అనుకున్నా.. అక్కడి కంటే కూడా.. జనసేన అయితే.. బాగుంటుందని కొన్నాళ్లుగా ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్‌ను కలుసుకుని చర్చించారు. త్వరలోనే ఆయన జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. అయితే.. గూడూరు టికెట్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి. ఏదేమైనా కీలకమైన ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి వివాద రహితుడుగా ఉన్న వరప్రసాద్ బయటకు రావడం రాజకీయంగా ఆ పార్టీకి ఇబ్బందనే చర్చ సాగుతోంది.