ఏపీ అధికార పార్టీ వైసీపీలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు పార్టీ అధినేత, సీఎం జగన్.. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో జోష్మీదున్నారు. కానీ, పార్టీలో మాత్రం ఆతరహా వాతావరణం కనిపించలేదు.
తాడేపల్లి సీఎం క్యాంపుకార్యాలయంలో సీఎం జగన్.. ఉత్సాహంగా ఈ సంబరాల కార్యక్రమం నిర్వహించారు. కానీ, జిల్లా స్థాయిలో చూసినప్పుడు ఎక్కడా కూడా నేతలు పెద్దగా పాల్గొనలేదు. కీలకమైన సలహాదారులు, పార్టీ ముఖ్యనేతలు కూడా ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం గమనార్హం.
నిజానికి వైసీపీ పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలని పార్టీ నుంచి ఆదేశాలు కూడా ఉన్నాయని నాయకులు చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విధించి న కర్ఫ్యూ కారణంగా నాయకులు పెద్దగా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోలేదని తెలుస్తోంది.
మరోవైపు.. నేత ల మధ్య ఆధిపత్య రాజకీయాలు కూడా ప్రధానంగా ఈ సంబరాలపై ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ పాలన రెండేళ్ల సంబరాలు కేవలం తాడేపల్లికే పరిమితమైనట్టు కనిపిస్తోంది.
అదేసమయంలో ఈ రెండేళ్ల పాలనలో ఆశించిన విధంగా ప్రభుత్వం అనుకున్నది సాధించలేదనేది సీనియర్ల మాట. ప్రత్యేక హోదా సహా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలోనూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలోనూ అడుగులు ముందుకు పడని పరిస్థితిని వారు గుర్తు చేస్తున్నారు.
గత ఏడాది కాలంగా కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కూడా దారుణంగా తయారవడం.. అన్ని రంగాల్లోనూ ఇబ్బందికర పరిస్థితులు.. వంటివి ప్రభుత్వం ఇది సాధించింది.. అని చెప్పుకొనేందుకు ఏమీలేకుండా పోయిందని అంటున్నారు.
ఈ పరిణామాలతో పాటు.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, నేతలకు, ఎంపీలకు, మంత్రులకు మధ్య గ్యాప్ పె రిగిపోయింది. దీంతో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడిగొంగళి అక్కడే అన్న చందంగా మారాయని, పైగా వలంటీర్ వ్యవస్థ కారణంగా.. నేతలకు, ప్రజలకు మద్య గ్యాప్ పెరిగిందని.. సో.. ఈ పరిణామాలే.. రెండేళ్ల సంబరాల్లో పెద్దగా జోష్ లేకుండా చేసిందనే వాదనకు కారణంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఎలా చూసుకున్నా.. రెండేళ్ల పాలన సంబరాల విషయంలో క్షేత్రస్థాయిలో ఎక్కడా జోరు కనిపించకపోవడం గమనార్హం.