పారిశుద్ధ్య కార్మికులతో జగన్ చెలగాటమాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టిన పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ఇవ్వని జగన్ రెడ్డి కుళ్లిన సర్కారును పారిశుద్ధ్య కార్మికులే ఊడ్చి చెత్తకుప్పలో పడేయడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. స్కానింగ్ మెషీన్లు ఇచ్చి పారిశుద్ధ్య కార్మికులపై పని ఒత్తిడి పెంచారని, రిటైర్ అయిన కార్మికుల స్థానంలో కొత్త వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా పనిభారాన్ని మోపారని ఆరోపించారు.
పనికి తగిన వేతనాలు ఇవ్వడం లేదని, మున్సిపల్ కార్మికులను ఆప్కాస్ లో చేర్చి నామమాత్రపు వేతనాలిస్తూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పండుగలు, శుభకార్యాలకు కూడా సెలవులు ఇవ్వకుండా కార్మికులను వేధిస్తున్నారని, జగన్ నిరంకుశ విధానాల వల్ల పారిశుద్ధ్య కార్మికుల జీవన స్థితిగతులు అగమ్యగోచరంగా మారాయని ఆరోపించారు. క్లీన్ ఏపీ వాహనాల డ్రైవర్లకు వేతనాలు ఇవ్వడంలో పక్షపాతం చూపిస్తోందని అన్నారు. కార్మికులు సమ్మెకు దిగినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు.