ఈ రోజు విశాఖలో జరిగిన విశాఖ గర్జన అట్టర్ ప్లాప్ టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. ఈ గర్జనకు భారీగా జనం వచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారని, కానీ, డ్వాక్రా మహిళలు, అంగన్ వాడీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని తరలించి ఈ గర్జనను వైసీపీ నిర్వహించిందని ఆయన ఆరోపించారు. అది విశాఖ గర్జన కాదని జగన్ రెడ్డి భజన అని విమర్శించారు.
అమరావతి రైతులను అడ్డుకునేందుకే జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ఆ కుట్రలకు ఆయనే అంతిమంగా బలవుతాడని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రాన్ని వైసీపీ నేతలు తాకట్టు పెడుతున్నారని రవీంద్ర ఫైర్ అయ్యారు. అమరావతే రాజధాని అని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించలేదా? వైసీపీ నేతలు అందుకు ఒప్పుకోలేదా? అని నిలదీశారు.
చంద్రబాబు మొదలుబెట్టిన రాజధానిని ఆపేసిన జగన్ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో భూదోపిడీకి తెరతీసిందని కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. విజయసాయి దోపిడీ సామ్రాజ్యానికి బొత్స, ధర్మాన, తమ్మినేని ఇతర వైసీపీ నేతలు కాపలా కాస్తున్నారని, ఉత్తరాంధ్ర ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వరుణుడి ప్రకోపంతో వైసీపీ గర్జన తుస్సుమందని, అన్ని వర్గాల వారు ప్రశాంతంగా ఉండే విశాఖను రణరంగంగా మార్చారని దుయ్యబట్టారు.
విశాఖపై ప్రేమ ఉన్న జగన్..చంద్రబాబు వేసిన భూగర్భ కేబుల్ పనులు ఎందుకు నిలిపేశారని ఆయన నిలదీశారు. ఈ మూడేళ్లలో జగన్ రెడ్డి ఒక్క రోడ్డైనా విశాఖలో వేశాడా? ఒక్క ఐటీ కంపెనీ అయినా కొత్తగా తీసుకొచ్చాడా? అని ప్రశ్నించారు. 1000 సీట్లున్న ట్రిపుల్ ఐటీని 500 సీట్లకు పరిమితం చేయడం, గిరిజన భూములు లాక్కొని బాక్సైట్ తవ్వడం, గంజాయి పండించడం తప్ప, ఐటీడీఏలకు రూపాయి అయినా ఇచ్చారా? అని నిలదీశారు.
ప్రత్యేకహోదా అని యువతను రెచ్చగొట్టిన జగన్, ఆ ఊసు ఎత్తడం లేదని, కులాలు, ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. రైతులపైకి వైపీపీ నేతలను ఉసిగొల్పి పాదయాత్రను అడ్డుకోవడం తప్పని, ప్రజలమద్ధతుతో సాగుతున్న రైతుల పాదయాత్ర కచ్చితంగా దిగ్విజయమవుతుందని అన్నారు.