2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ అధినతే వైఎస్ జగన్ కు ఆ పార్టీ నేతలు కొందరు షాకిచ్చిన సంగతి తెలిసిందే. మునిగిపోయే నావ వంటి వైసీపీని వీడి వారంతా టీడీపీ, జనసేన, బీజేపీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ కు వైసీపీ నేత, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ షాకిచ్చారు. త్వరలోన వైసీపీకి రాజీనామా చేస్తానని రాపాక ప్రకటించారు. వైసీపీతో తన బంధం తెగిపోయిందని, త్వరలో మరో పార్టీలో చేరతానని ప్రకటించారు. రాజోలు వైసీపీ కోసం కష్టపడి పనిచేసినా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని, ఇష్టం లేకున్నా ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యానని అన్నారు.
రాజోలు టికెట్ ను గొల్లపల్లి సూర్యారావుకు ఇచ్చారని, వైసీపీ ఇన్ చార్జ్ కూడా ఆయనేనని అన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఎట్టి పరిస్థితుల్లో కొనసాగబోనని తేల్చి చెప్పారు. కాగా, ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణం కాదని, అది శుద్ధ అబద్ధం అని రాపాక కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 3 పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేయడం, ఓట్ షేరింగ్ జరగడం, తమకు ప్రజలు ఓట్లేయక పోవడం వల్లే ఓడామని అసలు వాస్తవాన్ని రాపాక నిర్భయంగా ఒప్పుకున్నారు. సొంతగూటికి వెళ్లే క్రమంలోనే ఈ కామెంట్లు చేశారని, త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకుంటారని పుకార్లు వస్తున్నాయి.