వైసీపీ సీనియర్ నాయకుడు, ఎప్పుడూ వివాదాలకు చేరువగా ఉండే కడప జిల్లా పొద్రుటూరు మాజీ ఎమ్మె ల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత జగన్ బాటలోనే ఆయన కూడా నడిచారు. ఈవీఎంలపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. కూటమి సర్కారుకు-ఈవీఎంలకు మధ్య అను బంధం ఉందని ఆరోపించారు. అంతేకాదు.. దేశవ్యాప్తంగా ఈవీఎంలను రద్దు చేయాలని కోరారు. ఈవీఎంలతో కొందరే లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై చెబుతూ.. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహి స్తే.. తాను పోటీ చేయబోనని రాచమల్లు వెల్లడించారు. కేవలం బ్యాలెట్ ఎన్నికలు నిర్వహిస్తేనే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ అధినేతకు కూడా చెబుతానన్నారు. తన నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. “సాంకేతికత మంచిదే. కానీ, ఈవీఎంలు మంచివి కావు“ అని రాచమల్లు చెప్పుకొచ్చారు.
బ్యాలెట్ ద్వారా నిర్వహించే ఎన్నికల్లోనే ప్రజాస్వామ్యం ప్రతిబింబిస్తుందన్న రాచమల్లు.. ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వలేదని, ఈవీఎంలే తీర్పు చెప్పాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాను వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగిస్తే.. పోటీకి దూరంగా ఉంటానని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పూలేదన్నారు.
అయితే, రాచమల్లు ప్రకటనపై సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. “ఓడిపోతామని ముందే గ్రహించినట్టున్నారు సారు. అందుకే ఇలా వ్యాఖ్యానిస్తున్నారు“ అని చాలా మంది వ్యాఖ్యానించా రు. మరికొందరు 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఇలానే వ్యాఖ్యానించి ఉంటే బాగుండేది గురూ! అని చెప్పుకొచ్చారు. “జగన్‌కే కాదు.. వైసీపీ నాయకులకు కూడాఈవీఎంల బెంగపట్టుకుంది“ అని మరికొందరు అన్నారు. ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తే.. వైసీపీ పోటీచేయదు కాబట్టి.. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీనే విజయం దక్కించుకుంటుందని ఇంకొందరు చెప్పుకొచ్చారు.