వైసీపీ మాజీ మంత్రి, ఎస్సీ నాయకుడు, అమలాపురం మాజీ ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్ కుమారుడు పినిపె శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం తెల్లవారు జామున తమిళనాడులోని మదురై సమీపంలోని అతని స్నేహితుడి రూంలో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు వెళ్లి అరెస్టు చేసినట్టు తమిళనాడు మీడియా పేర్కొంది. సోమవారం ఆయనను స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి అమలాపురం తీసుకురానున్నారు. ఈయనపై హత్య కేసు అభియోగం ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఏం జరిగింది?
2021-22 మధ్య రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాలను విభజిస్తూ.. వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాను మూడు ముక్కలు చేసింది. 1) కాకినాడ, 2) తూర్పుగోదావరి. 3) కోనసీమ జిల్లాలుగా మార్పు చేసింది. ఇదేసమయంలో కోనసీమలో ఎస్సీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ జిల్లాకు రాజ్యాంగనిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టింది. ఆ తర్వాత.. కొందరి సూచనలతో ఆ పేరును రద్దు చేసింది. అయితే.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. మాల సామాజిక వర్గం నాయకులు.. పెద్ద ఎత్తున ఉద్యమించారు.
ఇది నెల రోజులకు పైగానే సాగింది. అయినా.. సర్కారు స్పందించలేదు. ఇంతలో మళ్లీ ఏమైందో.. తిరిగి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును కొనసాగిస్తున్నట్టు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ.. స్థానిక బలిజ సామాజిక వర్గం నాయకులు ఉద్యమించారు. ఇది వివాదానికి దారి తీసింది. ఈ పరిణామాల క్రమంలోనే ఉద్యమ కారులు.. అప్పటి మంత్రి పినిపె విశ్వరూప్, వైసీపీ ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయింది.
ఇదిలావుంటే… తమ ఇంటిని తగుల బెట్టేందుకు అయినవిల్లికి చెందిన వలంటీర్ దుర్గా ప్రసాద్ ఉప్పందించారన్నది.. పినిపె వర్గం ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆయన 2022, జూన్ 6న హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పినిపె కుమారుడు శ్రీకాంత్‌కు సంబంధాలు ఉన్నాయని.. అప్పట్లోనే గుప్పుమంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసు మరుగున పడింది. అయితే.. కూటమి ప్రభుత్వం వచ్చాక.. అమలాపురం అల్లర్ల కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. తిరగదోడడం ప్రారంభించింది.
దీనిలో భాగంగా పలువురు వైసీపీ కార్యకర్తలను ఈ నెలలోనే అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారం మేరకు.. తాజాగా పినిపె కుమారుడు శ్రీకాంత్‌ను మదురైలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ పరిణామాలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే పినిపె చెన్నైకి బయలు దేరినట్టు స్థానిక పార్టీ నాయకులు తెలిపారు.