ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. అధికారం చేతిలో ఉందన్న భావనతో మెజారిటీ పంచాయతీలను చేజిక్కించుకునేందుకు అధికార వైసీపీ తనదైన శైలి కుయుక్తులకు పాల్పడుతున్న వైనం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను భయకంపితులను చేసిన వైసీపీ… తుది విడత ఎన్నికల్లో మరింతమేర బరి తెగింపునకు పాల్పడింది. చంద్రబాబు స్వగ్రామం ఉన్న చంద్రగిరి మండలంలో వైసీపీ మద్దతుదారులు ఓటర్లకు ఎన్నికల స్లిప్పులతో పాటుగా ‘కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడి’ ప్రసాదం తిరుపతి లడ్డూలను అందజేసిన వైనం వెలుగు చూసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూను ఎన్నికల్లో తాయిలంగా వైసీపీ నేతలు వాడిన తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంపై విపక్ష టీడీపీ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.బుచ్చిరాంప్రసాద్ వైసీపీ వైఖరిపై విరుచుకుపడ్డారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఎన్నికల తాయిలంగా తిరుపతి లడ్డూను పంపిణీ చేసిన వైనంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఏమన్నారన్న విషయానికి వస్తే, ‘తిరుమల వేంకటేశ్వరుడి ప్రసాదం’ పరమ పవిత్రమైనది. వెంకన్నను దర్శించుకున్న తర్వాత ప్రసాదంగా లభించే తిరుపతి లడ్డూనూ అంతా పవిత్రంగా భావిస్తారు. ఒక్కో భక్తుడికి ఒక్కో లడ్డూ మాత్రమే దొరుకుతున్న విషయం తెలిసిందే. ఒకటికి మించి లడ్డూలు కావాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసులు కావాలి. తిరుపతి లడ్డూల తయారీ ఎంత పవిత్రంగా సాగుతుందో కూడా తెలిసిందే. స్వయంగా వేంకటేశ్వరుడి మాత వకుళాదేవీ పర్యవేక్షణలో ప్రసాదం తయారీ జరుగుతుందని హిందువులు భావిస్తారు. అలాంటి పరమ పవిత్రమైన లడ్డూలను చంద్రగిరి మండలం తొండవాడలో ఎన్నిక స్లిప్పులతో ఓటర్లకు తాయిలంగా పంచిపెట్టడం దుర్మార్గం.
అయినా భక్తులకు పరిమిత సంఖ్యలోనే లభించే లడ్డూలు ఓటర్లకు భారీ సంఖ్యలో పంపిణీ చేసే స్థాయిలో వైసీపీ నేతలకు ఎలా దొరికాయి? అసలు అన్నేసి లడ్డూలు తిరుమల ఆలయం నుంచి ఎలా బయటకు వచ్చాయో విచారణ చేయాలి. ఓటర్లకు లడ్డూలను పంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా దర్యాప్తునకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. హిందూయేతరుడైన జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో తిరుమల కొండపై లెక్కలేనన్ని దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. వీటన్నింటిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బుచ్చిరాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.