ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏం చేయాలన్నా.. సీఎం జగన్ చెబుతున్నారా? ఆయన ఎలా వ్యవహరించాల న్నా.. ఐప్యాకే సర్వమూ సర్వస్వమూ అనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు.. ఎమ్మెల్యేల నుంచి క్షేత్రస్థాయిలో నేతల వరకు.. అందరినీ ఆడిస్తున్నదీ.. ఆడేలా చేస్తున్నదీ ఐప్యాకేనని పెద్ద ఎత్తు న ఏపీలో చర్చ సాగుతుండడం గమనార్హం. ఇటీవల గుంటూరు జెడ్పీ సమావేశంలో ఐప్యాక్ సభ్యులు కనిపించడం.. అక్కడ భారీ గలాటా చోటు చేసుకున్నదరిమిలా.. ఏపీలో ఐప్యాక్‌పై పొలిటిక్ చర్చ జోరుగా సాగుతోంది.
తాజా పరిణామాలను గమనిస్తే.. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు.. ఎమ్మెల్యేలకు మధ్య ఎక్కడా పొసగడం లేదు. అదేసమయంలో క్షేత్రస్థాయిలో నాయకులకు, మంత్రులకు కూడా ఎక్కడా పడడం లేదు. వివాదాలు.. విభేదాలే కొనసాగుతున్నాయి. దీనికి చెక్ పెట్టాల్సిన అధిష్టానం మాత్రం కేవలం ఐప్యాక్సర్వేలను నమ్ముకుని.. వారిని హెచ్చరించడం వరకే పరిమితం అవుతోందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలావుంటే.. నాయకులు ఐప్యాక్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు.
“మేం బాగానే కష్టపడుతున్నాం. రాజకీయాలు మాకు ఇప్పుడు కొత్తకాదు. ఏళ్ల తరబడి రాజకీయాలు చేశాం. కానీ.. మేమేదో ఇప్పుడే.. కొత్తగా రాజీయాలు చేస్తున్నట్టు.. ప్రజానాడి మాకు తెలియనట్టు చెబుతుండడం.. ఏవో రిపోర్టులు పట్టుకుని మాపై పెత్తనం చేసేందుకు ప్రయత్నించడం.. కొంత మానసికంగా ఆందోళనగానే ఉంది. కానీ, ఏం చేస్తాం..ఎవరికిచెప్పుకొంటాం“ అని అనంతపురానికి చెందిన కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని మరికొందరు బయటకు చెప్పకపోయినా లోలోపల కుమిలి పోతున్నారు..
“నిధులు లేవు. నీళ్లు లేవు. అభివృద్ధి చేద్దామంటే అధికారులు కూడా మా మాట వినరు. ఏం చెప్పాలి మా బాధ“అని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ సివిల్ సర్వెంట్ అయిన.. ఎమ్మెల్యే ఒకరు వాపోయారు. ఇలా.. రాష్ట్రంలో దాదాపు 50 నుంచి 60 మంది ఐప్యాక్ చేస్తున్న సర్వేలు.. ఆ సర్వేలను అనుసరించి.. పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరును తూర్పారబడుతున్నారు. అయినా.. సరే… ఐప్యాక్ చెప్పిందే వేదంగా.. పార్టీ అడుగులు వేస్తోందని వీరు వాపోతున్నారు.