ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరకు ఎలాగోలా బ్రతిమిలాడో ..బామాలో…టికెట్ రేట్లు కొంచెం పెంచుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పించిన సినీ నిర్మాతలు, థియేటర్ల ఓనర్లకు వైసీపీ నేతల రూపంలో కొత్త చిక్కులు వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త సినిమా రిలీజైన వెంటనే తమకు ప్రతి షోకు100 టికెట్లు కావాలంటూ థియేటర్ల యజమానులకు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధికారికంగా లెటర్ హెడ్ పై రాసి మరీ హుకుం జారీ చేసిన వైనం కొద్ది రోజుల క్రితం హాట్ టాపిక్ గా నిలిచింది.
ఇక, తాజాగా నేడు ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైస సందర్భంగా థియేటర్ల యజమానులకు వైసీపీ నేతలు మరిన్ని కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. అభిమానులకు సినిమా టికెట్లు అందకుండా బ్లాక్ టికెట్ల దందాకు వైసీపీ నేతలు తెర తీశారని ఆరోపణలు వస్తున్నాయి. తాము చరణ్, తారక్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ…టికెట్లు తీసుకొని బ్లాక్ లో అమ్ముకుంటున్నారని అసలు సిసలు అభిమానులు వాపోతున్నారు. వైసీపీ శ్రేణులే బ్లాకులో ఒక్కో టిక్కెట్ రూ. 2 వేలకు అమ్మారని తెలుస్తోంది.
విడుదలైన ప్రతి సినిమాలోని హీరో ఫ్యాన్స్ అంటూ టిక్కెట్లలో సింహభాగం సొంతం చేసుకుని బ్లాక్ లో అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వైసీపీ నేతలు, వారి అనుచరుల టికెట్ల ధందా వైరల్ అయింది. నెల్లూరు జిల్లా, కావలిలో చిరు, నందమూరి అభిమానులమని చెబుతూ థియేటర్ల వద్దకు ఎవరినీ రానీయకుండా పెత్తనం చెలాయించినట్లు తెలుస్తోంది.
విజయవాడ మేయర్ ను స్ఫూర్తిగా తీసుకున్న గుంటూరు మేయర్ ప్రతి థియేటర్ నుoచి భారీగా టికెట్లు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక స్టేషన్ పేరుతో థియేటర్ల నుంచి సినిమా టికెట్లను పోలీసులు కూడా వసూలు చేశారని టాక్. ఇక, విజయనగరం జిల్లాలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో వైసీపీ నేతలు నానా హంగామా చేశారని తెలుస్తోంది. చీపురుపల్లిలో ఐదు థియేటర్లకు చెందిన ప్రదర్శన టిక్కెట్లను ఎంపీ చంద్రశేఖర్ కొడుకు వంశీకృష్ణ టిక్కెట్లు తీసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.
తమకు దక్కకుండా అభిమానులపేరుతో బ్లాక్లో భారీ ధరలకు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని వైసీపీ నేతల తీరుపై అసలు అభిమానులు మండిపడుతున్నారు. పోలీసులు, అధికారుల అండతోనే వైసీపీ శ్రేణుల బ్లాక్ టికెట్ల దందా సాగుతోందని ఆరోపిస్తున్నారు. రాజమండ్రిలో అయితే వైసీపీ నేతల డిమాండ్ ప్రకారం కొన్ని థియేటర్ల యాజమాన్యాలు బుకింగ్ కౌంటర్లు మూసేసి మరీ వైసీపీ నేతలకు టికెట్లు అందించారు. బ్లాక్లో టికెట్లు అధిక రేట్లకు విక్రయించడంతో సాధారణ ప్రేక్షకులు సైతం నిరాశతో వెనుదిరిగారు. దీంతో, చేసేదేమీ లేక ఆర్ఆర్ఆర్ టికెట్ల కోసం వైసీపీ నేతల ఇళ్లకు కొందరు అసలు సిసలు అభిమానులు క్యూ కట్టారు.