టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో తాము కక్ష సాధింపు చర్యగా వ్యవహరించడం లేదని పదే పదే వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చంద్రబాబుపై తమకు ఎలాంటి రాగ ద్వేషాలు లేవని చెప్పుకొచ్చారు. కానీ, అదేసమయంలో బొత్స కంటే ముందుగా ప్రెస్ మీట్ పెట్టిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి.. చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు.. సర్కారు ఉద్దేశాన్ని బట్టబయలు చేసిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
చంద్రబాబు ఏమన్నా అత్తగారింట్లో ఉన్నాడా? ఆయనేమన్నా కొత్త పెళ్లికొడుకా సౌకర్యాలు కల్పించేందు కు.. అని సజ్జల వ్యాఖ్యానించారు. ఇక, రాష్ట్రజైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ రవికిరణ్ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. జైలు అంటే జైలుగానే ఉంటుందని, అదేమీ సొంత నివాసం కాదని ఆయన వ్యాఖ్యానిం చారు. అంతేకాదు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న 2 వేల మంది ఖైదీల్లో చంద్రబాబు ఒకరు అంటూ అవహేళనగా వ్యాఖ్యానించడం కూడా రాజకీయ నిపుణులు తప్పుబడుతున్నారు.
ఇవన్నీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబును వేధిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నాయని వారు చెబుతున్నారు. అంతేకాదు.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా వారు ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు గజ దొంగ.. ఇప్పుడు దొరికాడు.. అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని.. 14 ఏళ్లపాటు పాలించిన చంద్రబాబును అంత చులకనగా మాట్లాడడం సరికాదని, ఇదిసహేతుకం కూడా కాదని వారు చెబుతు న్నారు.
ఈ పరిణామాలను గమనిస్తే.. చంద్రబాబు విషయంలో పైకి తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా.. జరుగుతున్న పరిణామాలు, వైసీపీ ముఖ్య నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. మాత్రం సర్కారు ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబుపై కక్ష సాధిస్తున్నట్టు తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు. ఏదేమైనా ఏపీ వంటిసునిశిత రాజకీయాలు నడిచిన నేలపై ఇలాంటి కక్ష సాధింపు పాలిటిక్స్ సరికాదని.. ఈ రోజు చంద్రబాబు.. రేపు మరొకరు కావొచ్చు.. ఎవరి విషయంలో అయినా.. ప్రభుత్వం హుందాగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.