ఆగ్రహం ఎంతైనా ఉండొచ్చు కానీ.. కొన్ని పరిమితుల్ని అస్సలు దాటకూడదు.
తాజాగా అలాంటివన్నీ పక్కన పెట్టేసిన ఏపీ అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు విపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో వేసిన వీరంగం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంటే ఏపీ అధికార.. విపక్షాల మధ్య పోరు జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి పెరుగుతూ ఉన్న విషయం తెలిసిందే.
రాష్ట్రం మొత్తం పరిస్థితి ఎలా ఉన్నా.. చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో మాత్రం అధిక్యతను ప్రదర్శించాలన్న పట్టుదలతో ఉన్న అధినేత లక్ష్యానికి.. వైసీపీ కార్యకర్తల ఉత్సాహం తోడైంది. దీంతో.. కుప్పంలో పరిస్థితులు ఇప్పుడు ఉద్రిక్తంగా మారాయి.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండురోజులు పర్యటన షెడ్యూల్ అయిన విషయం తెలిసిందే.
బుధ.. గురువారాల్లో కుప్పంలో చంద్రబాబు కార్యక్రమాలు ఉన్నాయి. అయితే.. బుధవారం రామకుప్పం మండలం కొల్లుపల్లెలో టీడీపీ – వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
దీంతో.. కుప్పంలో జరిగే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు గురువారం కుప్పం బంద్ నకు పిలుపునిచ్చారు.
తమకున్న బలాన్ని ప్రదర్శించేందుకు వీలుగా పెద్ద ఎత్తున బలప్రదర్శన చేపట్టారు.
ఈ ప్రదర్శన మామూలుగానే మొదలైనా.. వైసీపీ శ్రేణులు భారీగా వచ్చాయి. వీరి ర్యాలీ మొదలైన తర్వాత అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
కుప్పం పట్టణంలో ఈ రోజు చంద్రబాబు ప్రారంభించాల్సి ఉన్న అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ప్యాలెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలు.. బ్యానర్లను వైసీపీ శ్రేణులు చించేశాయి.
అనంతరం బస్టాండ్ సమీపంలోని టీడీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తల్ని మాత్రం పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ – టీడీపీ వర్గాల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్తల జోరుకు టీడీపీ తమ్ముళ్లు పలువురికి గాయాలు అయ్యయి.
ఈ అనూహ్య పరిణామంతోకుప్పంలో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీకి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున కుప్పానికి చేరుకున్నారు. దీంతో.. ఇరు పార్టీలు పోటాపోటీగా శ్రేణుల్ని రంగంలోకి దించటంతో పరిస్థితులు చేజారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా.. ఇలా ఒక పార్టీ అధినేత ప్రారంభించాల్సిన భవనాన్ని ధ్వంసం చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.