ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వైసీపీ అధ్యకుడు, పులువెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊహించని ఝులక్ ఇచ్చారు. ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న తమ్మినేనిని తాజాగా ఆ పదవి నుంచి తప్పించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత వైసీపీలో కీలక నాయకులతో పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పార్టీలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టారు.
అవసరమైన నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జిలను నియమిస్తున్నారు. కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిలను మారుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్తగా తమ్మినేని సీతారాంను తప్పించిన వైఎన్ జగన్.. ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న చింతాడ రవికుమార్ కు ఆ బాధ్యతలు అప్పగించారు.
మొన్నటి ఎన్నికల్లో ఆమదాలవలస అసెంబ్లీ స్థానానికి రవికుమార్ టికెట్ అశించినప్పటికీ.. జగన్ మాత్రం తమ్మినేనికే ప్రధాన్యత ఇచ్చారు. కానీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కూన రవి కుమార్ చేతుల్లో తమ్మినేని ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. కూన రవి కుమార్ మరెవరో కాదు తమ్మినేనికి స్వయానా మేనల్లుడు. ఇక ఎమ్మెల్యే టికెట్ ఆశించిన చింతాడ రవికుమార్ ను తాజాగా నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు జగన్. ఉన్న పదవి కూడా పోవడంతో తమ్మినేని రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.