కొండపల్లి అక్రమ మైనింగ్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమను అరెస్టు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కొండపల్లిలో అక్రమ మైనింగ్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిజ నిర్ధారణ కమిటీని వేశారు. పది మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఆ కమిటీ నేడు కొండపల్లి వెళ్లి క్షేత్రస్థాయిలో అక్రమ మైనింగ్ పై నిజనిర్ధారణ చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
అయితే, ఆ పర్యటనకు అనుమతి లేదంటూ టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో, ఈ నిర్బంధాలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరగలేదని నిరూపించాలని జగన్ కు సవాల్ విసిరారు. పోలీసుల సాయంతో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీల కోసం తీసుకొచ్చిన అట్రాసిటీ చట్టాలను అగ్రవర్ణాలు అసహ్యించుకునే రీతిలో జగన్ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కొండపల్లి వెళ్లి తీరుతామని, అక్రమ మైనింగ్ గుట్టురట్టు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అంత నిజాయితీపరుడు, నిబద్ధత కలిగిన నేత అయితే కొండపల్లిలో మైనింగ్ జరుగుతోందో లేదో అన్న నిజాలను నిగ్గు తేల్చడానికి నియమించిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేయడాన్ని బట్టి వైసీపీ నేతల అక్రమాలు, వసంత నిబద్ధత అర్థమవుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతలు చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మేందుకు ప్రజలు చెవిలో పువ్వులు పెట్టుకొని లేరని అంటున్నారు. తప్పు చేయనప్పుడు వైసీపీ నేతలు ఎందుకు వణుకుతున్నారని నిలదీస్తున్నారు.