2019 ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత జగన్…పాదయాత్ర చేస్తూ జనాలపై ముద్దులు కురిపించారు. ఒక్క చాన్స్..ఒకే ఒక్క చాన్స్ అంటూ ఖడ్గం సినిమాలో రవితేజలాగా కనిపించిన ప్రతి ఓటరును ప్రాధేయపడ్డారు. పోనీలే పాపం..ఇంతలా బతిమిలాడుతున్నాడు కదా అని వైసీపీ అధినేత జగన్ కు ఒక్క చాన్స్ ఇచ్చారు జనం. అంతే, సీన్ కట్ చేస్తే సీఎం అయిన తర్వాత జనానికి సీఎం జగన్ చుక్కలు చూపిస్తున్నారు.
ఓ పక్క పన్ను పోటు…మరో పక్క కరెంటు బిల్లుల షాక్ లు…తగ్గని పెట్రో, డీజిల్, నిత్యావరసర సరుకుల రేట్లు…వెరసి సామాన్యుడి నడ్డి విరుస్తోందీ ప్రభుత్వం. ప్రభుత్వ వ్యతిరేకత ఉవ్వెత్తున్న లేస్తున్నా, ప్రజల ఆగ్రహ జ్వాలలు మిన్నంటున్నా…అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తోన్న జగన్…ఎలాగోలా మూడేన్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే, జగన్ పాలనపై ప్రతిపక్ష నేతలు మొదలు సామాన్యుల వరకు అందరికీ వ్యతిరేకత పెరిగిపోతోంది.
ఈ క్రమంలోనే తాజాగా వైసీపీలో చేరినందుకు ఓ కార్యకర్త తీవ్రంగా పశ్చాత్తాప పడుతున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, వైసీపీలో చేరి తప్పు చేశానని, తనను క్షమించాలని వేడుకుంటూ మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై పడడం సంచలనం రేపింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పరిటాల సునీత హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన రామాంజనేయులు….హఠాత్తుగా సునీత కాళ్లపై పడి తనను క్షమించాలని వేడుకున్నాడు. టీడీపీ కార్యకర్త అయిన తాను వైసీపీలో చేరి తప్పుచేశానని, తనను మళ్లీ టీడీపీలో చేర్చుకోవాలని సునీతను ప్రాధేయపడ్డాడు. దీంతో, రామాంజనేయులను పైకి లేపిన సునీత.. ఇటువంటి కార్యకర్తలకు టీడీపీలో ఎప్పటికీ స్థానం ఉంటుందని కండువా కప్పి తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.