ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సినిమాల పరంగా కూడా రాజకీయ వేడి రాజుకుంది. వరుసగా పొలిటికల్ సినిమాలు ప్రేక్షకులను ముంచెత్తడానికి సిద్ధమయ్యాయి. ఇందులో ముందుగా రామ్ గోపాల్ వర్మ సినిమా ‘వ్యూహం’ రిలీజ్ కావాల్సింది. కానీ కోర్టు కేసుల్లో పడి ఆ సినిమా రిలీజ్ సందిగ్ధంలో పడింది. ఇంతలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర-2’ను థియేటర్లలోకి దించారు.
‘యాత్ర’తో వైఎస్ అభిమానులనే కాక సామాన్య ప్రేక్షకులను కూడా మెప్పించిన మహి.వి.రాఘవ్ తీసిన సినిమా కావడంతో దీనిపై కొంత ఆసక్తి నెలకొంది. ఐతే ‘యాత్ర’ అంత ఎమోషనల్‌గా సినిమా లేకపోవడం, మరీ ఏకపక్షంగా జగన్‌ను లేపే ప్రయత్నం చేయడంతో ఇది మెజారిటీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. జగన్, వైసీపీ అభిమానులు కూడా తొలి రోజు వరకే హడావుడి చేశారు. రెండో రోజు నుంచి సినిమాను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు.
రాజకీయంగా ఈ సినిమా వైసీపీకి ఏమేర ప్రయోజనం చేకూరుస్తుందో ఏమో కానీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఇది వాషౌట్ అయిపోయింది. వీకెండ్ తర్వాత మినిమం కలెక్షన్లు కూడా లేవు. జగన్‌కు ఎలివేషన్ ఇచ్చే సినిమా కథ ముగుస్తున్న సమయంలోనే జగన్‌ను టార్గెట్ చేసిన ‘రాజధాని ఫైల్స్’ అనే మరో చిత్రం థియేటర్లలోకి దిగుతోంది. ఈ పేరుతో ఒక సినిమా తెరకెక్కిన విషయం కొన్ని వారాల ముందు వరకు జనాలకు తెలియదు. సైలెంటుగా సినిమా పూర్తి చేసి ట్రైలర్‌తో రంగంలోకి దిగిన ‘రాజధాని ఫైల్స్’ టీం ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఐతే సోషల్ మీడియాలో ట్రైలర్‌కు వ్యూస్ ఇవ్వడం వేరు. థియేటర్లకు వచ్చి సినిమా చూడ్డం వేరు. ఇందులో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎవరూ పేరున్న వాళ్లు కాదు. అమరావతి రైతుల బాధను కళ్లకు కట్టే ప్రయత్నంలో ఒక ప్రయత్నం చేశారు. ట్రైలర్ వరకు బాగా అనిపించింది. మరి అధికార పార్టీని, సీఎంను టార్గెట్ చేసిన ఈ పొలిటికల్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతమేర ఆదరిస్తారో చూడాలి. ఈ గురువారమే ‘రాజధాని ఫైల్స్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.