డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఈ ప్రకారం పేరు మార్పునకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం, సంఖ్యాబలం అధికంగా ఉండడంతో ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ కావడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ పేరు మార్పు వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
ఈ పేరు మార్పునకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొందరు టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర ఆందోళనకు దిగారు. ఇక, ఈ పేరు మార్పు వ్యవహారంపై వైసీపీకి సొంత పార్టీలోనే సెగ తగులుతోంది. ఈ నేపథ్యంలోనే అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ రాజీనామా చేశారు. ఈ పేరు మార్పునకు నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన సంచలన ప్రకటన చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను నియమించిన సంగతి తెలిసిందే. వైసీపీ సానుభూతిపరుడిగా, టీడీపీ వ్యతిరేకిగా ఆయనకు పేరుంది. దీంతో, జగన్ ఆయనను ఆ పదవిలో నియమించారు. అయితే, అన్నగారితోపాటు వైఎస్సార్ వీరాభిమానిగా పేరున్న యార్లగడ్డ సైతం జగన్ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దేనికైనా వైఎస్ఆర్ పేరు పెడితే తనకు అభ్యంతరం లేదని…కానీ ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం సరికాదని యార్లగడ్డ అన్నారు.
ఎన్టీఆర్ పేరు తొలగింపుపై తీవ్ర మనస్థాపానికి గురయ్యానని, అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు అని ఆనాటి ముఖ్యమంత్రి వైయస్సార్ నామకరణం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందుకే తనకు వైఎస్ఆర్ అంటే గౌరవమని చెప్పారు.