సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఆయనపై నమ్మకంతో ఏపీలో భారీగా పెట్టుబడి పెట్టిన సంస్థలు సైతం జగన్ పాలనను చూసి పారిపోతున్న వైనంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ, జగన్ మాత్రం ఏపీలో తన హయాంలోనే కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయని చెబుతున్నారు.
తాజాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో యకహోమా గ్రూప్ 2,200 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ‘ఏటీసీ టైర్ల ‘ పరిశ్రమ ప్రారంభం సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘనత తనదేనంటూ జగన్ అంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే జగన్ పై టీటీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు .
ఏపీలో దొరల తరహా పాలన సాగుతుందని యనమల ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ యువకులకు వల్లమాలిన హామీలు ఇచ్చారని కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి నెత్తిపై భస్మాసుర హస్తం పెట్టారని యనమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఉపాధి కరువయ్యాయని మండిపడ్డారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అని, 2.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్న జగన్ ను యువత నిలదీయాలని యనమల పిలుపునిచ్చారు.
ఏపీలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోందని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో విఫలమైన జగన్ కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఉన్న పరిశ్రమలను కూడా తరిమేశారంటూ యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఆరు లక్షల మంది నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చామని, కానీ జగన్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారని యనమల గుర్తు చేశారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు ఆయా కార్పొరేషన్ల ద్వారా చంద్రబాబు ఉపాధి కల్పించారని, కానీ, జగన్ వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసి వారి పొట్ట కొట్టారని యనమల విమర్శించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని చురకలంటించారు.