మైసూర్ బొండాలో మైసూర్ ఉండదు…పులిహోరలో పులి ఉండదు…నేతి బీరకాయలో నెయ్యి ఉండదు…ఇప్పుడీ తొక్కలో సామెతలెందుకనుకుంటున్నారా? సీఎం జగన్ పాలన గురించి చెప్పాలంటే ఆ మాత్రం ఇంట్రో అవసరమే. పైన చెప్పిన సామెతల రీతిలోనే జగన్ చెబుతోన్న సామాజిక న్యాయంలో చిత్తశుద్ధి ఉండదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, ఆ విమర్శలకు తగ్గట్లుగానే జగన్ పాలన కూడా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.
జగన్ కు ప్రచారంపై ఉన్న శ్రద్ధ… ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని యనమల దుయ్యబట్టారు. నేతి బీరకాయలో నెయ్యి తరహాలో జగన్ మాటలున్నాయని విమర్శించారు. జగన్ గొప్పగా చెప్పే సామాజిక న్యాయంలో చిత్తశుద్ధి లేదని… ఆయన సామాజిక న్యాయం బూటకమని అన్నారు. ఆయన చేసే సామాజిక న్యాయం కంటే… అసామాజిక న్యాయమే ఎక్కువని దుయ్యబట్టారు. సమ సమాజం, నవ సమాజం స్థాపనలపై జగన్ కు అంకిత భావం లేదని చెప్పారు. నిబంధనల పేరుతో లక్షలాది మంది లబ్ధిదారులను తొలగించారని, సంక్షేమ పథకాలలో పెట్టిన కోతలపై శ్వేతపత్రం విడుదల చేయాలని యనమల డిమాండ్ చేశారు.
జగన్ సర్కార్ ప్రజా ధనాన్ని దోచుకుంటోందని అన్నారు. దీనంతటినీ త్వరలో ప్రజలే తిరిగి కక్కిస్తారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికే తమ సొంత పత్రికకు రూ.280 కోట్ల ప్రజాధనాన్ని మళ్లించుకున్నారని.. అవార్డుల పేరుతో సచివాలయాల వలంటీర్లకు రూ.485.44 కోట్లను దోచి పెడుతోందని ఆరోపించారు.‘‘ఇప్పుడు సచివాలయాల్లో వలంటీర్లు వార్తా పత్రికలు కొనుక్కోవడం కోసమని జగన్ ప్రభుత్వం నిధులు ఇస్తోంది. నెలకు రూ. 200 చొప్పున చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది. సచివాలయాలకు వార్తా పత్రికల కోసమని రూ.5.50 కోట్లను ఖర్చు చేస్తోంది. ఈ సొమ్మంతా జగన్ సొంత పత్రికను కొనుగోలు చేసేందుకే ఖర్చు పెట్టి.. సొంత ఖజానాకు లాక్కునే ఉద్దేశమే. ముఖ్యమంత్రి జగన్ తన సొంత పత్రికను పార్టీ కార్యకర్తలకు ఉచితంగా ఇవ్వలేరా..?” అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.