దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా జగన్ పది రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడబోతున్నారని, రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు, వందల కొద్ది కంపెనీలు తేవడం ఖాయమని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏపీ పెట్టుబడులకు స్వర్గధామమని, కంపెనీ పెడితే ఏపీలో పెట్టాలనేలా ఆ సదస్సులో జగనన్న స్పీచ్ ఉంటుందని ఓ రేంజ్ లో హైప్ ఇస్తున్నారు.
సరే, వైసీపీ నేతలు చెప్పినంత స్థాయిలో కాకపోయినా…ఏదో తనకు వచ్చిన ఇంగ్లిష్ లో జగన్ పడుతూ లేస్తూ మాట్లాడి మమ అనిపిస్తారులే అని విపక్షనేతలు అనుకున్నారు. అయితే, ఇటు స్వపక్ష నేతలకు, అటు విపక్ష నేతలకు ఏకకాలంలో షాకిచ్చిన జగన్…ప్రత్యేక విమానంలో లండన్ లో ల్యాండ్ కావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో, జగన్ లండన్ ల్యాండింగ్ వెనుక మిస్టరీ ఏంటి?..అన్న వ్యవహారంపై చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ లండన్ ల్యాండింగ్ మిస్టరీ ఏమిటి..? దండుకున్న అవినీతి సంపద దాచుకోడానికేనా? అనే అనుమానాలను నివృత్తి చేయాలని యనమల డిమాండ్ చేశారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఈ సదస్సు జరగలేదని, మూడేళ్ల తర్వాత జగన్ దావోస్ వెళ్లింది రాష్ట్రం కోసమా లేక తన కోసమా..? అని ప్రశ్నించారు.
తాను అక్రమంగా సంపాదించిన నల్లధనం తరలింపు కోసం, దండుకున్న సంపద దాచుకోవడం కోసం లండన్ లో జగన్ ల్యాండ్ అయ్యారేమో అనే అనుమానం ప్రజల్లో ప్రబలంగా ఉందని యనమల అన్నారు. అధికారులతో కలిసి అధికారిక పర్యటనకు వెళ్లిన జగన్, వారిని మధ్యలోనే వదిలేసి ప్రత్యేక విమానంలో జగన్, భారతి, మరో వ్యక్తి మాత్రమే లండన్ కు వెళ్లారని తెలుస్తోందని, ఒకవేళ లండన్ కు వెళ్లాలనుకుంటే అధికారికంగానే వెళ్లొచ్చని… చాటుమాటుగా వెళ్లాల్సిన అవసరం ఏముందని అన్నారు.
వ్యక్తిగత పనులకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ దేశానికి వెళ్లడానికి సీబీఐ కోర్టు అనుమతిని ఇచ్చిందని ప్రశ్నించారు.తన భార్య భారతితో కలిసి లండన్ లో ల్యాండ్ అయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో యనమల ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. మరి, ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.